Businessman Kidnap Case at Gachibowli : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం రేపింది. ఎస్ఓటీ పోలీసులమంటూ ఓ కంపెనీ ఎండీతో పాటు సేల్స్ కో ఆర్డినేటర్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. వారి కుటుంబ సభ్యుల నుంచి రూ.4 కోట్లు కావాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. బాధితురాలి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చివరికీ కిడ్నాపర్సే వారిద్దరిని విడిచిపెట్టి పారిపోయారు. ఈ అంశంపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గచ్చిబౌలిలో కంపెనీ నిర్వహిస్తున్న సాయిగుప్తా గతంలో గౌతమ్ భవిరిశెట్టితో కలిసి వ్యాపారం చేసేవాడు. కొంతకాలంగా ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు రావడంతో సాయి గుప్తా గచ్చిబౌలిలో సొంతంగా కంపెనీ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 8 గంటలకు గచ్చిబౌలి సాయిగుప్తా కార్యాలయానికి ఫార్చునర్, ఐ 20 కార్లలో దుండగులు వచ్చారు. ఆయనను వెనక నుంచి కారుతో ఢీకొట్టి ఎస్ఓటీ పోలీసులమంటూ ఫార్చూనర్ కారులో ఎక్కించుకొని దుండగులు పరారీ అయ్యారు.
గతంలో వ్యాపార భాగస్వామ్యంలో కలిసి పని చేసిన గౌతమ్ భవిరిశెట్టి తన అనుచరులతో కలిసి మొదటగా జగద్గిరిగుట్టలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సాయిగుప్తా, కో ఆర్డినేటర్ సతీష్ రెడ్డిలపై దాడి చేశారు. చంపేస్తామంటూ బెదిరించారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ.4 కోట్లు తెప్పించాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి తిరిగి వికారాబాద్‌లోని నిర్మాణ్యుశ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఇద్దరిపై మరోసారి దాడికి పాల్పడ్డారు. బాధితులు ఇంటికి రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు.
ఖాళీ బాండ్లపై సంతకాలు చేసి విడిచిపెట్టారు : పోలీసులు నిందితులను గాలిస్తున్నారని గ్రహించి ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకుని వికారాబాద్‌లో సాయి గుప్తాను, కో ఆర్డినేటర్లను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో 13 మంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్ సూత్రధారి గౌతమ్ భవిరిశెట్టిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.