BRS MLA Harish Rao Comments On CM Revanth : కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయారని, నిరంతరం పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిదని అన్నారు. పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర తనదని చెప్పుకొచ్చారు.
సిఎం రేవంత్ రెడ్డి గారూ!
— Harish Rao Thanneeru (@BRSHarish) July 18, 2024
తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు.
👉కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరు.
👉రేవంత్ రెడ్డి గారు, నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన… pic.twitter.com/mghX3v2TES
తనకు పదవులు కొత్త కాదని, రాజీనామాలు కొత్త కాదని ప్రజలకు తన వల్ల మంచి జరుగుతుందంటే తాను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడనని హరీశ్ తెలిపారు. ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రూ. 2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు చేసి చూపించమని సవాలు విసిరారు. రుణమాఫీ, హామీల అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని చేయని పక్షంలో నువ్వు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డిని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
రైతులకు గడువులోపు రుణమాఫీ : రుణమాఫీపై సవాల్ చేసిన నాయకున్ని తాము రాజీనామా చేయమనట్లేదని ఎందుకంటే వారు ఎలాగూ పారిపోతారని తమకు తెలుసని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును ఉద్దేశించి అన్నారు. మీలాంటి బూటకపు మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట మీద నిలబడుతుందన్న నిజాన్ని ఇప్పటికైనా తెలుసుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ మాటే శిలాశాసనం : కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని మరోసారి రుజువైందని సీఎం రేవంత్ తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు. తొలివిడతగా రూ.1 లక్ష లోపు రైతు రుణాల మాఫీని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సచివాలయం నుంచి ఆయన మాట్లాడారు. మొత్తం 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్ల నగదు జమ చేసినట్లు తెలిపారు. ఆర్థికశాఖ ఇప్పటికే బ్యాంకులకు నగదు జమ చేసింది.