BRS Leader Kavitha Judicial Custody Extended : దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో ఆమెను సీబీఐ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో కవితకు మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది.
అంతకుముందు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ కవిత కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించాలని కోరింది. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపింది. దిల్లీ లిక్కర్ వ్యవహారంలో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది. మరోవైపు కవిత తరఫు న్యాయవాది మాట్లాడుతూ కస్టడీ పొడిగింపు కోరేందుకు ఈడీ వద్ద కొత్తగా ఏం లేదని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట - మధ్యంతర బెయిల్ నిరాకరించిన కోర్టు - MLC Kavitha Interim Bail Denied
Telangana BRS MLC Kavitha ED Arrest : కవిత కోర్టులో నేరుగా మాట్లాడేందుకు అనుమతి కోరగా, జడ్జి నిరాకరించారు. నిందితురాలికి మాట్లాడే హక్కు ఉందని కవిత తరఫు న్యాయవాది వాదించగా, అందుకు దరఖాస్తు చేసుకోవాలని జడ్జి కావేరి బవేజా సూచించారు. కోర్టు హాలులో భర్త అనిల్, మామ రామకిషన్‌రావును కలిసేందుకు కవిత తరఫున న్యాయవాదులు దరఖాస్తు చేయగా కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో కవితను భర్త అనిల్, మామ కిషన్ రావు కలిశారు.
Delhi Liquor Policy Scam : రాజకీయ, వ్యాపారవేత్తల వరుస అరెస్టులు, విచారణలతో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ వ్యవహారంతో సంబంధముందని ఆరోపిస్తూ మార్చి 15న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. 16న దిల్లీలోని పీఎంఎల్ఏ కేసుల విచారణ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. అటు కవిత, ఇటు ఈడీ తరఫున వాదనలు విన్న న్యాయస్థానం, వారం పాటు ఆమెను కస్టడీకి అనుమతించింది.
వారం తర్వాత కవిత ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్ ఆన్‌లైన్‌లో వాదనలు వినిపిస్తూ, కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కవితను 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరారు. దీంతో కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి అనుమతిచ్చింది. ఇవాళ కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో మరోసారి ఆమెను కోర్టులో హాజరు పరిచారు. 14రోజులు కస్టడీ పొడగించాలని కోరగా కోర్టు అనుమతిచ్చింది. మరోవైపు కవిత మధ్యంతర బెయిల్‌ను కోర్టు నిరాకరించింది. ఆమె సాధారణ బెయిల్‌పై ఈ నెల 20న విచారణ చేపట్టనుంది.
వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్‌రెడ్డికి సుప్రీం నోటీసులు - viveka murder case