BOATS REMOVAL AT PRAKASAM BARRAGE: విజయవాడ ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపును మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. బ్యారేజీ వద్ద అడ్డుపడిన బోట్లను వెలికితీసే పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. డైవింగ్ టీమ్ నది లోపలికెళ్లి నిరంతరాయంగా బోటును కోస్తున్నారని అన్నారు. బోట్లు దృఢంగా ఉండటం వల్ల కోత ఆలస్యమవుతోందని చెప్పారు.
బ్యారేజీ వద్దకు మరో టీమ్: ఇప్పటికి 40 మీటర్ల వెడల్పు ఉన్న ఓ బోటును కోయడాన్ని దాదాపు పూర్తి చేశారు. 40 టన్నుల పైగా బరువున్న బోటును రెండు ముక్కలు చేయగా, ఒక్కటి 20 టన్నుల బరువుంటుందని అధికారులు చెబుతున్నారు. నదిలో తేలుతూ 10 టన్నులు బరువు మోయగలిగే, 10 ఎయిర్ బెలూన్లు ఏర్పాటు చేసి వాటి సాయంతో బోటు భాగాలను బయటకు పంపాలని తొలుత భావించినా నదిలో ప్రవాహం గణనీయంగా 60 వేల క్యూసెక్కులు ఉండటంతో వాటితో తీయడం సాధ్యపడదని తేల్చారు. కోసిన బోట్లు నదిలోపలి భాగంలో చిక్కుకోకుండా, సురక్షితంగా బయటకు తరలించేందుకు నిపుణులను రప్పించారు.
దీనికోసం గతంలో గోదావరిలో కచ్చులూరు వద్ద బోటు నదిలో మునిగిన బోటును వెలికి తీసిన టీంను విజయవాడకు రప్పించారు. తొలుత బ్యారేజీ పైకి భారీ క్రేన్లను తీసుకు వచ్చి ముక్కలు చేసిన బోట్లనుపైకి లేపుతారు. అనంతరం బ్యారేజీ వెనుక వైపు నుంచి భారీ పంటును తీసుకువచ్చి, కోసిన బోటు ముక్కను పంటుపైకి ఎక్కించి బయటకు తరలించాలని ప్రణాళిక వేశారు. అలా సాధ్యపడక పోతే కోసిన బోటుభాగాన్ని మరో భారీ పడవకు కట్టి నదిలో వెనక్కి లాగడం ద్వారా బయటకు తీసుకువచ్చేలా ఆలోచన చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కల్లా ఓ బోటును తొలగించి తదుపరి మిగిలిన రెండు భారీ బోటులను బయటకు తీయడంపై దృష్టి పెట్టనున్నారు.
"వరద సమయంలో ఢీ కొన్న బోట్లను బయటకు తీసే కార్యక్రమంలో ఏదో ఒక అంతరాయం ఏర్పడుతోంది. ఎందుకంటే ఆ బోటు ఒక్కొక్కటీ 40 టన్నుల బరువు ఉంది. దానికి సరిపడా యంత్రాలు తీసుకొచ్చినా కూడా, బోట్లు ఒకదానికి ఒకటి లింక్ చేసి ఉన్నాయి. దీని వలన స్కూబా డైవర్స్ని తీసుకొచ్చి బోట్లను రెండుగా కట్ చేస్తున్నాము". - నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ మంత్రి
Boats At Prakasam Barrage : కాగా ప్రకాశం బ్యారేజీ వద్ద ఈ నెల 10వ తేదీన బోట్లు తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజున ఒక్కొక్కటి 50 టన్నుల చొప్పున మొత్తం 100 టన్నుల బరువు ఎత్తగలిగే రెండు బాహుబలి క్రేన్లతో ఎత్తినా, భారీ బోటు కొంచెం కూడా కదల్లేదు. దీంతో ప్రయోజనం లేదని భావించిన అధికారులు, భారీ బోట్లను ముక్కలుగా కోసి బయటకు తరలించాలని నిర్ణయించారు. స్పెషల్ డైవింగ్ టీంలను రంగంలోకి దింపి పడవలను కోసి బయటకు తీసే ప్రక్రియ ప్రారంభించారు.
ఇటీవల వరదలకు 5 భారీ బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రెండు గేట్ల కౌంటర్ వెయిట్లు ధ్వంసం అయ్యాయి. 5 బోట్లలో ప్రస్తుతం 3 ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద ఉన్నాయి. ఒకటి ప్రవాహంలో కొట్టుకుపోగా మరొకటి నీటి అడుగు భాగానికి చేరినట్లు అంచనా వేస్తున్నారు. ఒక్కోటి 40 టన్నుల వరకు బరువు ఉండటంతో పాటు, 3 బోట్లు ఒకదానితో మరొకటి లింకు చేసి ఉండటంతో క్రేన్ల ద్వారా ఎత్తలేకపోయారు.
దీంతో వాటిని ముక్కలుగా కత్తిరించి తొలగించేందుకు స్కూబా డైవర్లు వచ్చారు. నీటిలో మునిగి బోటు కింది భాగంలో గ్యాస్ కట్టర్లతో కత్తిరిస్తున్నారు. మొత్తం కత్తిరిస్తే ముక్కలను వెలికి తీసేందుకు అవకాశం ఉంటుంది. ఈ బోట్లను తొలగించేందుకు, ధ్వంసమైన కౌంటర్ వెయిట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.