BJP State Media In-Charge Nagabhushanam about Pensions : రాష్ట్ర వ్యాప్తంగా మే నెలకు సంబంధించిన సామాజిక ఫించన్ల పంపిణీకి సమయం సమీపిస్తోంది. అయినా అధికార యంత్రాంగం ఇంతవరకు తగిన చర్యలు తీసుకోకపోవడం ఉద్దేశపూర్వకంగా పేదలను ఇబ్బందులకు గురిచేయాలనే ధోరణి కనిపిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. ఏప్రిల్ నెల ఫించన్ల పంపిణీలో అధికారులకు ముందు చూపు లేకపోవడం, పూర్తి అలక్ష్యం కారణంగానే 32 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారని విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాగభూషణం దుయ్యబట్టారు.
May Month Pensions : ఈసారి మే నెలలో కూడా అదే పరిస్థితి పునరావృతం అయితే ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలుగా పరిగణించాల్సి వస్తుందని నాగభూషణం హెచ్చరించారు. అధికార వైఎస్సార్సీపీకి లబ్ధి చేకూర్చాలనే దృక్పథంతో కొందరు అధికారులు సమయం సమీపిస్తున్నా సన్నాహాలు చేయడం లేదనే అనుమానం కలుగుతోందని నాగభూషణం స్పష్టం చేశారు.
మే నెలలో కూడా ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయరా? : ఏప్రిల్ మొదటి వారంతో పోలిస్తే మే నెలలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఠారెత్తిస్తున్న ఎండలతోపాటు, వేడిగాలుల ప్రభావం వల్ల వృద్ధులు ఆ సమయంలో బయటకొస్తే మరింత ఇబ్బందులకు గురవుతారని నాగభూషణం ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పదంతో అధికారులు పెన్షన్ల పంపిణీని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ సాధ్యమేనని ఎక్కువ మంది జిల్లా కలెక్టర్లు భావిస్తున్నా, మే నెల కూడా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా తాత్సారం చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ఎక్కడా పింఛన్లను ఇంటింటికీ పంపిణీ చేయొద్దని చెప్పలేదని, అనేక విమర్శలు వచ్చిన తరుణంలో వాలంటీర్లతో పంపిణీ చేయించవద్దని మాత్రమే చెప్పిందని నాగభూషణం పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా సంబంధిత అధికారులు ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వాలంటీర్లలో అత్యధికులు వైఎస్సార్సీపీకి కార్యకర్తలేనన్నది బహిరంగ రహస్యమన్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా ప్రకటించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు
ఒకటో తేదీ వస్తోంది - ఈసారైనా ఇంటి వద్దే పింఛన్లు ఇస్తారా ? - Pension Distribution Issue
సచివాలయ ఉద్యోగి ద్వారా పెన్షన్ పంపిణీ సాధ్యం : మొత్తం 65.95 లక్షల మంది ఫించనుదారులకు ఒక్కో సచివాలయ పరిధిలో పంచాల్సిన పింఛన్లు సగటున 439 వరకు ఉంటాయని, ఒక్కో సచివాలయ ఉద్యోగికి ఒక రోజుకి 40 ఫించన్లు పంపిణీ చేయడం ద్వారా మొత్తం అందరికీ ఇంటి వద్దకే నగదు ఇవ్వొచ్చని నాగభూషణం తెలిపారు. ఇప్పటికే ఫించనుదారుల్లో చాలా మందికి బ్యాంకు ఖాతాలున్నాయని, వారికి ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తే ఇంటింటికి ఫించను ఇవ్వాల్సిన వారి సంఖ్య ఇంకా తగ్గుతుందని, వాస్తవ పరిస్థితులు అంత స్పష్టంగా కనిపిస్తున్నా అధికారులు తెలిసి ఈ విషయాన్ని సంక్లిష్టం చేస్తున్నారని పాతూరి నాగభూషణం మండిపడ్డారు.