BJP State Executive Meeting: వికసిత్ భారత్, ఆత్మ నిర్భర కు ప్రజలు ఓటు వేసి ఎన్డీఏ కూటమికి కేంద్రం, రాష్ట్రంలో అద్భుత విజయం అందించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఎలక్షన్ కమిషన్ అద్భుతంగా ఎన్నికలు నిర్వహించిందని శుభాకాంక్షలు తెలిపారు. భారత్ ఆర్థిక వ్యవస్థను 11 నుంచి 5వ స్థానానికి తీసుకు వచ్చిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందని, గత ఐదేళ్లలో సుమారు 15 కోట్ల మందికి కుళాయి కనెక్షన్లు అందించామని, లక్షల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టామని అన్నారు.
గోదావరి తీరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాజమహేంద్రవరం మంజీరా కన్వెన్షన్ హాలులో నిర్వహించిన సమావేశానికి 2 వేలకు పైగా బీజేపీ నాయకులు హాజరయ్యారు. సమావేశానికి కేంద్ర మంత్రులు మురుగన్, శ్రీనివాస్ వర్మ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అజయ్ సింగ్, రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్ తాను చేసిన విధ్వంసాలు మరిచిపోయి, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని పురందేశ్వరి ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 24 కోట్ల ఓట్లు వచ్చాయని, గతంలో కంటే ఓట్లు పెరిగాయని, మన బలం పెరిగిందని తెలిపారు. ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్ల మనకు సీట్లు తగ్గాయని అన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అవమానిస్తే, మోదీ రాజ్యాంగానికి నమస్కరించారన్నారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అవమానిస్తే, వాజ్‌పేయి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించిందని పురందేశ్వరి చెప్పారు.
పదేళ్ల బీజేపీ పాలనలో దేశం అద్భుత ప్రగతి సాధించిందని పురందేశ్వరి తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అద్భుత విజయం సాధించిందని, వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రజలు ఓటు వేశారని అన్నారు. ఎన్డీఏ కూటమి విధానాలకు అనుకూలంగా ప్రజలు ఓటు వేశారన్నారు. లక్షల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టామన్న పురందేశ్వరి, ఐదో ఆర్థికశక్తిగా భారత్ ఎదగడం వల్లే అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి చారిత్రక విజయం సాధించిందని కేంద్ర మంత్రి మురుగన్ అన్నారు. మోదీ ఆధ్వర్యంలో కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలు, రాష్ట్రానికి అందించిన వివిధ ప్రాజెక్టులను వివరించారు. దేశాభివృద్ధి కోసమే ప్రధాని మోదీ ఆలోచనలని, మూడోసారి బాధ్యతలు చేపట్టాక పేదలకు 3 కోట్ల ఇళ్ల పథకంపై ప్రధాని మోదీ మొదటి సంతకం చేశారని మురగన్ పేర్కొన్నారు. రైతుల ఖాతాలకు రూ.20 వేల కోట్లను జమచేస్తూ రెండో సంతకం చేశారని మురగన్ తెలిపారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అజయ్ సింగ్ ఇండీ కూటమిపై విమర్శలు గుప్పించారు.