BJP Protest On Rythu Runa Mafi At Indira Park : రైతు రుణమాఫీ వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పోర్టల్‌లో పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతు హామీల సాధన కోసం బీజేపీ ప్రజా ప్రతినిధులు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు 24 గంటల దీక్ష చేపట్టారు.
ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో రైతు హామీల సాధన దీక్ష పేరుతో బీజేపీ ప్రజా ప్రతినిధులు నిరసన దీక్ష చేపట్టారు. ఆ పార్టీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే.అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, గోడెం నగేష్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావుపటేల్, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, పాల్వాయి హరీష్ బాబు దీక్షలో కూర్చున్నారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై తీవ్రంగా స్పందించారు.
మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ ఈ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు రాకపోవడం గమనార్హం. ఇక పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు శాసనసభ్యలు గైర్హజరయ్యారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపెల్లి వెంకటరమణారెడ్డి, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిరసన దీక్షకు హాజరుకాలేదు.
రుణమాఫీ ప్రజా పోర్టర్‌లో పెట్టాలి : కాంగ్రెస్ అధికారంలో వచ్చాక వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే రుణమాఫీ ఎంత చేశారో ప్రజా పోర్టర్‌లో పెట్టాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. అధికారం పదేళ్లలో బీఆర్ఎస్ ఎంత అపఖ్యాతి మూటకట్టుకుందో పది నెలల్లో కాంగ్రెస్ అంతే మూటకట్టుకుందని ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. మంగళవారం ఉదయం 11 గంటల వరకు బీజేపీ ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష కొనసాగనుంది. దీక్షకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆ పార్టీ నాయకులు తరలి వచ్చి సంఘీభావం తెలిపారు.
"కాంగ్రెస్ అధికారంలో వచ్చాక వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే రుణమాఫీ ఎంత చేశారో ప్రజా పోర్టర్‌లో పెట్టాలి. రుణమాఫీ పూర్తిగా సాధ్యం కాదని తెలిసి కూడా హామీలు ఇచ్చారు. ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా పూర్తి చేసే సత్తా కాంగ్రెస్‌కు లేదు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మాత్రమే పూర్తిగా అమలు చేశారు.మాట ఇస్తే తప్పని వ్యక్తి ప్రధాని మోదీ మాత్రమే."-బీజేపీ నాయకులు