Big Scam In Guntur GDCC Bank On Farmer Loans : రైతులు, మహిళా సంఘాలకు ఊతంగా నిలవాల్సిన గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కొందరు రాజకీయ నేతలు, అక్రమార్కులకు ఏటీఎంలా మారింది. వైఎస్సార్సీపీ పాలనలో సొసైటీలకు ఎన్నికలను నిర్వహించకుండా పాలక వర్గాలను నామినేట్ చేయడంతో అక్రమాలకు పునాది పడింది. అప్పటి ఛైర్మన్ సహా కొందరు వైఎస్సార్సీపీ నేతలు చేసిన అక్రమాల తీగ లాగితే డొంక కదిలినట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
నకిలీ ఆధార్ కార్డులు, పట్టాదారు పాసు పుస్తకాలు పెట్టి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వైనం బయటపడుతోంది. గుంటూరు గ్రామీణ మండలం నల్లపాడులోని జీడీసీసీ (Guntur District Co-Operative Central) బ్యాంకులో 70 కోట్ల రూపాయల రుణాలిచ్చారు. ఒక శీతల గిడ్డంగిలో నిల్వ ఉన్న మిర్చికి ఏకంగా 53 కోట్ల రుణం ఇచ్చారు. 2022-23లో ఇచ్చిన రుణాలకు సంబంధించి ఇప్పుడు నోటీసులిస్తున్నారు. సిద్ధార్థ అనే వ్యక్తి బ్యాంకుకు వచ్చి అధికారులను నిలదీడంతో ఆయన పేరున ఉన్న 10 లక్షల మొత్తాన్ని శీతల గిడ్డంగివారి నుంచి జమ చేయించేందుకు ప్రయత్నించారు.
'బ్యాంకు పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనూ నకిలీ పాసుపుస్తకాలు పెట్టి 11కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. పల్నాడు జిల్లాలో శీతలగిడ్డంగిలో ఉన్న సరకుకు చూపి 50 మంది రైతుల పేర్లతో యజమాని 5కోట్ల రూపాయల వరకు రుణం తీసుకుని చెల్లించలేదు. గుంటూరు నగరానికి చెందిన వైఎస్సార్సీపీ కీలక ప్రజాప్రతినిధి బంధువు ఒకరు నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డులు సృష్టించి అడ్డా కూలీలు, రోజువారీ కూలీ చేసుకునే మహిళలకు డబ్బు ఆశ చూపి వారి పేర్లతో సొసైటీల్లో రుణాలు పొందారు. జీడీసీసీ (GDCC) బ్యాంకు నిధులను లోన్ల రూపంలో కాజేసిన వారిని వదిలిపెట్టేది లేదు.' - తెనాలి శ్రావణ్ కుమార్, తాడికొండ ఎమ్మెల్యే
రుణాలు మంజూరు విషయంలో అధికారులు కనీస నిబంధనలు పాటించకపోవటం దారుణమని నిపుణులు అంటున్నారు. సమగ్ర దర్యాప్తు జరిపించి అక్రమార్కులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటవంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.