Bhramaramba Bugga Rameswara Swamy Temple: కర్నూలు జిల్లాలోని ఆ ఆలయ కోనేరులు వందల ఏళ్లుగా జలకళతో అలరారేవి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తొలుత కోనేరుల్లోని స్వచ్ఛమైన నీటిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకునేవారు. ఆ కోనేటి నీరే కొన్ని గ్రామాల దాహార్తిని తీర్చడమే కాకుండా కొన్ని వందల ఎకరాలను నీటిని అందించి సస్యశ్యామలం చేసింది. ఐతే అదంతా గతం. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, స్థానికంగా భూగర్భ జలాల నీటిమట్టం తగ్గడంతో సహజ సిద్ధమైన నీటి ఊట ఆగిపోయింది. దీంతో కోనేరులు జలకళ లేక వెలవెలబోతున్నాయి.
'బోర్లు ఉన్న చోట్ల మాత్రమే ఆరుతడి పంటలు వేసుకోవడం మేలు' - Agriculture Officer Interview
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని కాల్వబుగ్గ గ్రామంలో కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారిని ఆనుకుని శ్రీ భ్రమరాంబ బుగ్గ రామేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో రెండు కోనేరులు ఉన్నాయి. భూగర్భం నుంచి కోనేరుల్లోకి స్వచ్ఛమైన నీరు ఉబికి వచ్చేది. ఔషధ గుణాలు కలిసిన పవిత్రమైన ఈ నీటిలో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం. పవిత్ర జలాల్లో స్నానం చేసేందుకే సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వచ్చేవారు. కోనేటి నీటి ప్రవాహం ద్వారా హుసేనాపురం, కాల్వ తదితర గ్రామాల్లోని సుమారు 2 వేల ఎకరాల్లో పంటలు కూడా పండించేవారు.
ఆలయం కింది నుంచి నీటి బుగ్గ పుట్టటం వల్ల బుగ్గ అని, పరుశురాముడు విగ్రహాలను ప్రతిష్ఠించటం వల్ల రామేశ్వరం అని అందుకే ఈ క్షేత్రానికి బుగ్గ రామేశ్వరం అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి స్వామి వారు పశ్చిమ ముఖంగా ఉండటం ఓ ప్రత్యేకత అయితే. జంట నందులు ఉండటం మరో ప్రత్యేకత. ఇక్కడ వివాహం చేసుకుంటే భార్యాభర్తలు సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం. ఇక్కడ సహజా సిద్ధమైన కోనేటి నీటి ఊట కారణంగా పరిసర ప్రాంతాల భూములు ఒకప్పుడు కోనసీమను తలపించేవి.
కరవు పరిస్థితులు శివయ్యకు సైతం తప్పటం లేదు. గత మూడేళ్లుగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొనటం ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటటంతో కోనేటి ఊటలు ఆగిపోయాయి. దీంతో రెండు కోనేరులూ ఎండిపోయాయి. మరోవైపు ఆలయం పరిసర ప్రాంతాల్లో భారీగా బోర్లు వేయటం మరో కారణంగా స్థానికులు చెబుతున్నారు. దీంతో ఓ బోరు ద్వారా ఒక కోనేటిలోకి ఆలయ సిబ్బంది నీటిని విడుదల చేస్తున్నారు. ఎంతో చరిత్ర ఉన్న బుగ్గ రామేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం వర్షాభావ పరిస్థితుల కారణంగా వెలవెలబోతోందని భక్తులు ఆందోళన చెందుతున్నారు.
ఉప్పురైతులను నిలువునా ముంచేసిన అకాల వర్షం - ఆదుకోవాలని ప్రభుత్వానికి వినతి