Bear Rampage in Untakal at Anantapur District: అటవీ ప్రాంతాల్లో సరైన ఆహారము, తాగు నీరు లేకపోవడంతో అడవి జంతువులు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్రభయాందోళనలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. మండలంలోని ఉంతకల్ గ్రామంలోకి ఎలుగుబంటి చొరబడి ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. గ్రామ సమీపంలోని దేవాలయం వద్ద గల బిల్వ వృక్షం పైకి ఎక్కి కూర్చుంది. ఎలుగుబంటిని చూడడానికి గ్రామస్థులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. గత రెండు మూడు రోజులుగా గ్రామ సమీపంలోని కొండలో ఉంటుందని గ్రామస్థులు తెలిపారు.
అడవిలోకి వెళ్లిన గొర్రెలు, మేకల కాపర్లు ఎలుగుబంటిని చూసి భయాందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో గ్రామంలోకి ఎక్కడ వస్తుందోనని నిద్రాహారాలు మాని గొర్రెల మంద వద్ద కాపలా ఉంటున్నామని కాపర్లు వాపోయారు. గత కొద్ది రోజుల క్రితం మండలంలోని దేవగిరి క్రాస్ వద్ద ఎలుగుబంటి సంచరిస్తూ ప్రజలను రైతులను భయాందోళన గురిచేసిందని అన్నారు. అటవీ శాఖ అధికారుల సహకారంతో ప్రజలు ఎలుగుబంటిని సమీపంలోని కొండలోకి తరిమేశారని తెలిపారు.
ఇటీవల చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, నెమళ్లు జనవాసాల్లోకి వస్తున్నాయని అన్నారు. అడవిలో జంతువులకు ఎలాంటి ఆహారం, తాగునీరు లేక దాహంతో గ్రామాల్లోకి చొర బడుతున్నాయని గ్రామస్థులు అన్నారు. అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రూర మృగాలు గ్రామాల్లోకి రాకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బత్తాయి వ్యాపారుల బడా మోసం- ధర ఉన్నా నాణ్యత సాకుతో కోతలు - Mosambi Farmers Low Price