Bangladeshi Illegal Migrants in Hyderabad : బంగ్లాదేశీయులు తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోకి ప్రవేశిస్తున్నారనే సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. బాలాపూర్, కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి, పహాడీషరీఫ్, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. చిరువ్యాపారాలు, పరిశ్రమలు, భవన నిర్మాణరంగ కార్మికులుగా ఉపాధి అవకాశాలు చూసుకుని ఉంటున్నారు. వీలు చిక్కినప్పుడల్లా పోలీసుల కన్నుగప్పి స్వదేశానికి వెళ్లి దర్జాగా తిరిగి వస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారి చెబుతున్నారు.
ఇటీవల కోల్‌కత్తా నుంచి ఖమ్మం చేరిన బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురు మైనర్లు అపరేషన్ ముస్కాన్‌లో పట్టుబడ్డారు. స్వచ్ఛంద సంస్థ సాయంతో ఆ పిల్లల్ని సొంత దేశానికి పంపారు. పశ్చిమబెంగాల్‌లోకి చొరబడిన నలుగురు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పట్టుబడ్డారు. హైదరాబాద్ నగరంలోని తమ బంధువులు సూచనతో ఉపాధి కోసం ఇక్కడకు వచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడించారు.
బంగ్లా సంక్షోభంతో భారత్‌కు పెను సవాళ్లు- ప్లాన్ మార్చకపోతే మొదటికే మోసం! - Bangladesh Crisis
దళారులుగా మారి : అక్రమంగా రాష్ట్రానికి చేరిన బంగ్లాదేశీయుల్లో కొందరు దళారులుగా మారుతున్నారు. ప్రైవేట్ పరిశ్రమల్లో పని చేసేందుకు తమ వారిని నగరానికి రప్పిస్తున్నారు. అక్రమంగా సరిహద్దు దాటించి రైళ్లల్లోకి చేర్చేంత వరకూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని ఏజెంట్లు ఈ దళారులకు సహకరిస్తారు. దీనికి ప్రతిఫలంగా ఐదారు వేల వరకు కమీషన్ ఇస్తున్నట్టు సమాచారం.
రైలు మార్గాన తెలంగాణకు : బంగ్లాదేశ్ నుంచి మాల్డా ద్వారా సరిహద్దు దాటిం కోల్‌కతా చేరుస్తారు. కోల్‌కతాలో నకిలీ ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులను తయారు చేసి చేతికిచ్చి రైలు మార్గంలో తెలంగాణకు తరలిస్తున్నట్టు పట్టుబడిన నిందితులు విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. ఆపరేషన్ ముస్కాన్‌లో దొరికిన ఐదుగురు మైనర్లు తమ తోపాటు మరో 20 మంది ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు.
బాలాపూర్, కంచన్‌బాగ్ అడ్డాలుగా దళారులు కార్యకలాపాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. రెండేళ్ల వ్యవధిలో సుమారు వెయ్యి మందికి పైగా బంగ్లా నుంచి అక్రమంగా వచ్చి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరిని గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది. తాజాగా నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అక్రమ వలసదారులను గుర్తించేందుకు చర్యలు చేపట్టింది.