Balineni Srinivasa Reddy meets Pawan Kalyan : వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. బుధవారం జగన్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం బాలినేని నాగబాబుతో చర్చలు జరిపినట్లు సమాచారం. కొద్దిసేపటి క్రితం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్న బాలినేని, పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. త్వరలోనే ఆయన జనసేన గూటికి చేరే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా వైఎస్సార్సీపీకి గుడ్‌బై పలికారు. ఆయన కూడా జనసేనానితో భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు.
'అడిగిన వెంటనే పార్టీలోకి ఆహ్వానించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు. త్వరలో ఒంగోలులో కార్యక్రమం ఏర్పాటు చేసి పవన్ సమక్షంలో జనసేనలో చేరుతాను. పవన్ ఆదేశాల మేరకు పనిచేస్తా. అందరినీ కలుపుకొని జనసేన అభివృద్ధికి కృషి చేస్తా. మాజీ సీఎం జగన్‌ను బ్లాక్మెయిల్ చేసినట్లు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు రాశాయి. గతంలో నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్సార్సీపీని వీడలేదు. జగన్‌ను నమ్మి ఆస్తులు పోగొట్టుకున్నాను. సమావేశాల్లో జగన్ ఎప్పుడూ నా గురించి మాట్లాడలేదు. నాతో పరిచయం లేకపోయినా పవన్ నా గురించి మంచిగా మాట్లాడారు. నాకు పదవులు ముఖ్యం కాదు. గౌరవం కావాలి. స్వచ్ఛందంగా జనసేనలో చేరుతున్నాను. పదవులు ఆశించలేదు. అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.
జగన్ వైఖరితో ఇబ్బందులు పడ్డా: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో ఉదయభాను పవన్‌ను కలిశారు. ఈ క్రమంలో సామినేని మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయనే ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. మనసుకు కష్టం కలిగినందునే పార్టీని వీడినట్లు స్పష్టం చేశారు. జగన్‌ను అనేకసార్లు కలిసి పరిస్థితి చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు.
పరిణామాలు చూస్తే వైఎస్సార్సీపీకి భవిష్యత్తు కనిపించట్లేదన్నారు. భవిష్యత్తు చూసుకోవాలనే తామంతా బయటకు వచ్చినట్లు ఉదయభాను తెలిపారు. పవన్ కల్యాణ్‌ను కలిసి అన్ని విషయాలు చర్చించినట్లు వివరించారు. ఈ నెల 22న తన అనుచరులతో కలిసి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. కూటమి పార్టీల నాయకులతో కలిసి నడిచేందుకు సిద్ధమని సామినేని ఉదయభాను తెలిపారు. వైఎస్‌తో ఎంతో సన్నిహితంగా పని చేశానని అదే కమిట్మెంట్తో వైఎస్సార్సీపీలో చేరినా జగన్ వైఖరితో ఇబ్బందులు పడ్డానని వివరించారు.
జగన్‌కు మరో షాక్ - వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన బాలినేని - Balineni Srinivasa resign to YSRCP