PV Sindhu invites AP CM and Deputy CM Pawan to her wedding : తన వివాహానికి రావాల్సిందిగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆహ్వానించారు. ఆదివారం సాయంత్రం ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబును, అలాగే మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్‌ను తండ్రి రమణతో కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 22వ తేదీన వెంకట దత్త సాయిని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కాబోయే దంపతులు నిశ్చితార్థం చేసుకున్నారు.
ఇక పెళ్లి వేడుక ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరగనుంది. ఈ నెల 20 నుంచి సింధు పెళ్లి వేడుకలు మొదలు కానున్నాయని సమాచారం. అయితే డిసెంబర్ 24వ తేదీన హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇక కాబోయే దంపతులు వివిధ ప్రముఖులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, సచిన్ తెందూల్కర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలిసి వారిని తమ పెళ్లికి హాజరుకావాలని కోరారు.
మిస్ టు మిసెస్ - స్పెషల్ ఈవెంట్లో రింగ్స్ మార్చుకున్న పీవీ సింధు జంట
ఇక పీవీ సింధు కాబోయే వరుడు పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయి. ఆయన బ్యాడ్మింటన్ ఆడరు కానీ ఆయనకు ఆటలపై బాగానే ఆసక్తి ఉంది. మోటార్ స్పోర్ట్స్‌లో తనకు ప్రవేశం ఉంది. డర్ట్ బైకింగ్, మోటార్ ట్రెక్కింగ్‌లో తరచూ పాల్గొంటుంటారు. తన దగ్గర డజను సూపర్ బైక్స్‌తో పాటు కొన్ని స్పోర్ట్స్ కార్లూ ఉన్నాయి.
తన తండ్రి గౌరెల్లి వెంకటేశ్వరరావు ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మాజీ అధికారి. ప్రస్తుతం సాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న ప్రోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థను ఆయనే నెలకొల్పారు. సాయి తల్లి లక్ష్మి. ఆమె తండ్రి భాస్కరరావు హైకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు. భాస్కరరావు అన్న ఉజ్జిని నారాయణరావు సీపీఐ పార్టీ తరఫున నల్గొండ జిల్లా మునుగోడు మాజీ ఎమ్మెల్యేగా సేవలు అందించారు. జిందాల్ సౌత్ వెస్ట్ (జేఎస్‌డబ్ల్యూ)తో ప్రొఫెషనల్ కెరీర్‌ను ప్రారంభించిన సాయి, జేఎస్‌డబ్ల్యూ సహ యజమానిగా ఉన్న దిల్లీ క్యాపిటల్స్ జట్టు వ్యవహారాల్ని చూసుకున్నారు.
పెళ్లి పీటలెక్కనున్న స్టార్ షట్లర్ - రాజస్థాన్‌లో పీవీ సింధు వివాహం
'పెళ్లైన తర్వాత బ్యాడ్మింటన్ కంటిన్యూ చేస్తాను - ఇప్పటికీ రోజూ ప్రాక్టీస్ చేస్తున్నా'