Arrangements for General Election Votes Counting: సార్వత్రిక ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపుకు సమయం వచ్చింది. దీని కోసం ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. 13 రౌండ్లు మాత్రమే ఉన్న నరసాపురం, కొవ్వూరు నియోజకవర్గాల ఫలితాలు తొలుత వెలువడనున్నాయి. 29 రౌండ్లలో జరిగే రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాల ఫలితాలు రాత్రికి తేలనున్నాయి.
ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి జూపూడిలోని నోవా ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని ఫలితాలు వెలువడిన తర్వాత రోజు కూడా ఎవరూ దుకాణాలు తెరవొద్దని ఎస్పీ మలికా గార్గ్ ఆదేశించారు. నరసరావుపేట సమీపంలోని జేఎన్టీయూ కళాశాల లెక్కింపు కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాలకు 2 కిలోమీటర్ల దూరాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించారు. బాపట్ల జిల్లాకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ మళ్లింపుతోపాటు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కడప శివారులోని ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రం వద్ద నాలుగంచెల భద్రత కల్పించారు. వెయ్యిమంది రౌడీలను గుర్తించి ముందస్తు అరెస్టులు చేయడంతో పాటు 21 మందిని జిల్లా బహిష్కరణ చేశారు. అత్యంత సమస్యాత్మక నియోజకవర్గమైన జమ్మలమడుగులో కర్ఫ్యూ విధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దుకాణాలు తెరవొద్దని హెచ్చరించారు. కర్నూలు జిల్లాకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరిగే రాయలసీమ వర్శిటీ పరిసర ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. తిరుపతి జిల్లాలో 2500 మంది పోలీసులు, 300 మంది సాయుధ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతర అల్లర్ల దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
విజయనగరం, మన్యం జిల్లాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు చేశారు. మన్యం జిల్లాకు సంబంధించి 4అసెంబ్లీ స్థానాలతో పాటు అరకు పార్లమెంట్ ఓట్ల లెక్కింపు, గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో జరగనుంది. విజయనగరం జిల్లాలోని ఏడు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానానికి రెండు కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. లెండి ఇంజినీరింగ్ కళాశాలతోపాటు జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో ఓట్లు లెక్కించనున్నారు. కోనసీమ జిల్లాకు సంబంధించి ముమ్మిడివరం సమీపంలోని చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద భద్రత పెంపు - TDP Central Office