APSRTC Arranged Special Buses for Elections : ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి ఓటర్లు పోటెత్తుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఉండే హైదరాబాద్ నుంచి ఓటర్లు తరలివస్తున్నారు. దీంతో మే 13 న ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చేవారి కోసం శనివారం, ఆదివారం ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతెలిపారు. హైదరాబాద్ నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రోజూ 339 సర్వీసులు నడుస్తాయని, వీటికి అదనంగా శనివారం 302, ఆదివారం 206 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇవాల హైదరాబాద్ నుండి ఒంగోలు 38, ఏలూరుకు 20 బస్సులు, మచిలీపట్నంకు 23, విజయవాడకు 45, గుంటూరు 18, నరసరావు పేట 26, నెల్లూరు 17, నంద్యాల 19, విశాఖపట్నం 4 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బెంగుళూరు నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఇవాల మొత్తం 323 బస్సులు, 12 వ తేదీన 269 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెగ్యులర్గా నడిచే బస్సులతో పాటు అదనంగా ఈ బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు- 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు లేఖ : అయితే ఈనెల 13న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు వేర్వేరు ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈరోజు ఆర్టీసీ ఎండీకి లేఖ రాశారు. ఆర్టీసీ బస్సులు పెంచితే ప్రయాణ సౌకర్యంతో ఓటింగ్ శాతం పెరుగుతుందని సూచించారు. ప్రధానంగా తెలంగాణలో ఉన్న ఏపీ ఓటర్లు సొంత ప్రాంతాలకు రావడం ఇప్పటికే మొదలైందని ఇది దృష్టిలో పెట్టుకుని బస్సులను పెంచాలని చంద్రబాబు తన లేఖలో ఆర్టీసీ ఎండీని కోరారు. ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ బస్టాండ్లలో రద్దీ కనిపిస్తోందన్న చంద్రబాబు అవసరమైనన్ని బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు నిరీక్షిస్తున్నారని తెలిపారు. ఈ రెండు, మూడు రోజులు అదనపు బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణాలకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. చంద్రబాబు లేఖ అనంతరం ఆర్టీటీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించటం గమనార్హం.
బస్టాండ్లలో గంటల తరబడి పడిగాపులు : ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి ఓటర్లు పోటెత్తుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఉండే హైదరాబాద్ నుంచి ఓటర్లు తరలివస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్లే వాహనాలతో విజయవాడ జాతీయ రహదారిపైనా రద్దీ నెలకొంది. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు చెప్పినా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ దిశగా అడుగులు పడటం లేదు. దీంతో బస్టాండ్ ప్రాంగణంలోనే ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
అమాంతం రేట్లు పెంచేసి ప్రైవేటు ట్రావెల్స్ : ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అమాంతం రేట్లు పెంచేసి నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. ఉద్యోగం, ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వలస వచ్చిన వారు దాదాపు 30 లక్షల పైనే ఉంటారని అంచనా. ఏటా పండగలు, ప్రత్యేక రోజుల్లో తమ సొంతూళ్లకు వెళ్తుంటారు. ఆ సమయాల్లో వీరిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతి సమయంలో ఆర్టీసీ 4 వేల ప్రత్యేక బస్సులను నడిపి లక్షలాది మందిని సొంతూళ్లకు చేర్చింది. కానీ, ఓట్ల పండుగకు ప్రత్యేక బస్సులు సరిపడినన్ని ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. కొందరు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఏదోరకంగా చేరుకొని, అక్కడి నుంచి వేరే వాహనాల్లో సొంతూరు చేరుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. పట్టు వదలని విక్రమార్కుల్లా ఎలాగైనా ఈసారి ఓటేసి రావాలని డిసైడయ్యారు.
సొంతూళ్లకు పయనమైన ఏపీ ఓటర్లు- ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు