APGEA Meeting in Vizianagaram: రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు రాష్ట్రంలో మనుగడ సాగించే పరిస్థితి లేదని, సమస్యలు, హక్కులపై మాట్లాడితే, చంపేస్తామన్న స్థాయికి వ్యవస్థ వచ్చిందని, దీంతో అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. దీనికోసం ఉద్యోగ సంఘాలన్నీ కలసి రావాలని కోరారు. విజయనగరంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదార్ల ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఏపీజీఈఏ (AP Govt Employees Association) జిల్లా అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్, ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్. సూర్యనారాయణతో పాటు కార్యవర్గ సభ్యులు, వివిధ శాఖల ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఉద్యోగుల ఓట్ల కోసం డీఏల ఎర - పాత బకాయిలను గాలికి వదిలి ఓట్ల కోసం జగన్ నటన
రోజురోజుకి కూనారిల్లిపోతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షర్ల వ్యవస్థను బతికించాలనే ఉద్దేశంతో భావ సారూప్యత గల 30 ఉద్యోగ సంఘాలు సమైఖ్యంగా ఏర్పడి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షర్ల ఐక్య వేదికను ఏర్పాటు చేశామని సూర్యనారాయణ అన్నారు. 12 ప్రాధాన్యత అంశాలపై ఉద్యోగులను చైతన్య పరిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేదిక ద్వారా చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా రాబోయే ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచారు. అందులో ప్రధానంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు ప్రభుత్వాలు, పాలకుల భిక్షగా కాకుండా, అది తమ హక్కుగా ఉండాలన్నారు. విధానపరమైన నిర్ణయాల విషయంలో నెలకొన్న అస్పష్టతలు తొలగించి, ఉద్యోగులను ప్రభుత్వం గౌరవించాలని ఆయన ఆకాంక్షించారు. ఉద్యోగ సంఘాల నాయకులతో అగౌరవంగా ప్రవర్తించటం మానుకోని, సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధి చూపాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల కోడ్‌తో సంబంధం ఏంటి ? - ఉద్యోగ సంఘాలపై బొత్స, సజ్జల చిరాకు
ఇటీవల రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకి పంపిన స్థానికతకు బదులు ఓపెన్ కాంపిటిషన్లో అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు కల్పించాలనే ప్రతిపాదనను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయల విషయంలో మూడు దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని అస్తవ్యస్థ నియామక వ్యవస్థను బాగు చేయాలని కోరారు. సీపీఎస్ విధాన సమస్యకు తార్కికమైన ముగింపు పలకాలన్నారు. వీటన్నింటిపై ఒక శాస్త్రీయమైన పరిష్కారాలతో రాజకీయ పక్షాలు, తమ విధానపరమైన నిర్ణయాలు ప్రకటించాలన్నారు.
అంతకు ముందు జరిగిన సమావేశంలో పలు ఉద్యోగ సంఘాల రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు మాట్లాడుతూ, ఉద్యోగికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు చెల్లించాలని, ఒకటో తేదీనే జీతాలు అందచేయాలని కోరారు. ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ సకాలంలో అందించటంతో పాటు, సీపీఎస్ విషయంలో నెలకొన్న సందిగ్ధ పరిస్థితికి తెర దించాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులా, కార్పొరేషన్ ఉద్యోగులా తెలియని పరిస్థితి నెలకొందని వాపోయారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందన్నారు. సచివాలయ ఉద్యోగులకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేకపోవటమే కాకుండా, సర్వీస్, పదోన్నతలపై స్పష్టత లేదన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు- ఉద్యమం వైపు వెళ్లేలా చేయవద్దు: బొప్పరాజు