YS Sharmila Wishes: రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని, పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలని ఆకాంక్షించారు.
రాజధాని నిర్మాణం జరగాలని, నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలని, సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలని, ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజారిటీతో ముందుకు ఎలా అడుగు వేయాలో ఆలోచన చేయాలని అన్నారు. ప్రత్యేక హోదా కోసం కట్టుబడితేనే, అన్ని విభజన హామీలకు కట్టుబడితేనే, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ, ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతుందన్నారు.
CONGRESS IN ANDHRA PRADESH ELECTIONS: కాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 156 శాసనసభ, 23 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసినా ఒక్కచోటా బోణీ కొట్టలేదు. 3 లోక్‌సభ, మరో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు 50 వేల నుంచి లక్షకుపైగా ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిల లక్షా 41 వేల 039 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. కర్నూలు, తిరుపతి, నెల్లూరు, రామహేంద్రవరం లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన రాంభూపాల్ యాదవ్‌కు 70 వేల 373, చింతామోహన్‌కు 65 వేల 523, కొప్పుల రాజుకు 54 వేల 844, గిడుగు రుద్రరాజుకు 32 వేల 508 ఓట్లు వచ్చాయి. శాసనసభ నియోజకవర్గాలైన చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ 41 వేల 859 ఓట్లు, మడకశిరలో సుధాకర్ 17 వేల 380 ఓట్లను సాధించారు.
కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన వైఎస్ షర్మిల వైఎస్సార్సీపీకి ముచ్చెమటలు పట్టించినా, ఫలితాల్లో 3వ స్థానానికి పరిమితమయ్యారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డికి సీఎం జగన్ మరోసారి టికెట్ ఇవ్వడంతో, అవినాష్ ఓటమే లక్ష్యంగా షర్మిల బరిలో దిగారు. ఆమెకు తోడుగా వివేకా కుమార్తె సునీత ప్రచారంలో పాల్గొన్నారు. వీరిద్దరి ప్రచారం కడప లోక్‌సభ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ శిబిరంలో కలకలం సృష్టించింది. అయినా కూడా కడప లోక్‌సభ స్థానంలో షర్మిల మూడో స్థానానికి మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది.