NATIONAL INTEGRATION CAMP 2024 : విద్యార్థులు కేవలం తరగతి గదుల్లో చెప్పే పాఠాలకు మాత్రమే పరిమితమైతే కెరీర్‌కు పెద్దగా ప్రయోజనం ఉండదు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ప్రపంచంలో ఏం జరగుతుందో తెలుసుకోవాలి. మన దేశ సంప్రదాయాలు, భిన్న సంస్కృతులపై కూడా అవగాహన అవసరం. అందుకే వివిధ రాష్ట్రాల విద్యార్థులను ఒక్కచోట చేర్చి నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్‌ల ద్వారా ప్రయత్నం జరుగుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తాచాటారు మన తెలుగు విద్యార్థులు.
వివిధ అంశాలపై అవగాహన : ఏటా ఒక్కో ప్రాంతంలో నిర్వహించే నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్ ఈ సారి కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. నేషనల్ సర్వీస్ స్కీం ఆధ్వర్యంలో విద్యార్థులు వారం రోజులపాటు వివిధ అంశాలపై అవగాహన పెంచుకుని ప్రతిభ, నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నారు. మెంటర్స్ ప్రోత్సాహంతో కొత్త విషయాలు నేర్చుకున్నారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు : నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్‌లో కర్ణాటకలోని 5 విశ్వవిద్యాలయాలు సహా కేరళ, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన బృందాలు పాల్గొన్నాయి. ఏపీ తరఫున రాయలసీమ విశ్వవిద్యాలయం విద్యార్థులకు అవకాశం లభించింది. ఒక్కో రాష్ట్రం నుంచి పది మంది చొప్పున విద్యార్థులు సహా ప్రోగ్రాం ఆఫీసర్స్ పాల్గొన్నారు. మొత్తం 108 మంది ఈ క్యాంపులో పాల్గొన్నారు.
ఈ క్యాంప్‌కి వచ్చిన విద్యార్థులను 5 గ్రూపులుగా విభజించారు నిర్వాహకులు. వాటిలో 4 గ్రూపులకు మన విద్యార్థులే నాయకత్వం వహించారు. ప్రోగ్రాం ఆఫీసర్ శివప్రసాద్ రెడ్డి మరో గ్రూపును లీడ్ చేశారు. మన విద్యార్థులు కూచిపూడి, జానపదాలు, కర్రసాము, తెలుగు పాటలతో చక్కగా అలరించారు. మన ఆహార అలవాట్లైన రాగిసంగటి, జొన్నరొట్టె, నాటుకోడి పులుసు, పూతరేకులు, కుండబిర్యాని, ఆవకాయ గురించి తెలియజేశారు.
పట్టుదల, కృషి - అద్భుతాలు సృష్టిస్తున్న వారిజ నేత్ర విద్యాలయ విద్యార్థులు - VARIJA NETRA VIDYALAYA
సంస్కృతి, సంప్రదాయాల గురించి అవగాహన : జాతీయ స్థాయిలో తెలుగువారి గొప్పదనాన్ని ఘనంగా చాటారు. మన సంస్కృతీ సంప్రదాయాలు, వైభవాన్ని సమర్థవంతంగా వివరించారు. తెలుగువారికి మాత్రమే ప్రత్యేకమైన పంచెకట్టు, చీరల గొప్పదనాన్ని చాటారు. మన రాష్ట్రంలో లభించే ఖనిజ సంపద గురించి, తిరుమల ఆధ్యాత్మికతను, పర్యాటక స్వర్గధామం అరకు వ్యాలీ గురించి వివరించారు.
భిన్నత్వంలో ఏకత్వం : భాషలు వేరైనా అందరూ తమ అభిప్రాయాలను పంచుకోవటం, తమ రాష్ట్రాల గురించి తెలియజేయటం చేశారు. గుజరాతీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సంస్కృతులూ, సాంప్రదాయాల గురించీ మన విద్యార్థులు తెలుసుకున్నారు. వారితో కలిసి ట్రెక్కింగ్ సహా అక్కడి పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. అక్కడే మొక్కలు నాటారు. అయితే ఇలాంటి కార్యక్రమాలు మాలో నూతనోత్తేజాన్ని నింపుతాయంటున్నారు విద్యార్థులు.
ఉద్యోగంలో సవాళ్లను దాటుకుంటూ ముందుకెళ్లడమే నిజమైన సక్సెస్ : దీపికాపాటిల్ ఐపీఎస్ - Deepika IPS
భారతదేశం అంటే భిన్న సంస్కృతులు, భిన్న మనుషుల సంగమం. కులాలు, మతాలు వేరైనా అందరూ కలిసి మెలసి సోదర భావంతో జీవించాలి. అందరినీ గౌరవించాలి. భిన్నత్వంలో ఏకత్వం అనే విషయాన్ని చాటాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని సంస్కృతులు, సంప్రదాయాలను, ఆహార అలవాట్లు, కట్టు, బొట్టును తెలియజేయటం సహా అందరూ తెలుసుకోవాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తూ - తైక్వాండోలో రాణిస్తున్న విజయవాడ అమ్మాయి - Taekwondo pavani sai