AP PCC President YS Sharmila on Visakha Drug Case : విశాఖ డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సార్వత్రిక ఎన్నికల తరుణంలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్సీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ట్విట్టర్ (X) వేదికగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ అని కానీ ఇప్పుడు యావత్ డ్రగ్స్ సప్లై చేసే డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా (Drugs Capital of India) మారిందని ఆరోపించారు. గంజా, హెరాయిన్, కొకైన్ ఏది కావాలంటే అది దొరికే "ఉడ్తా ఆంధ్రప్రదేశ్"గా మరిందని దుయ్యబట్టారు. ఇండియాలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ వైపై చూపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి 5 ఏళ్లు తెలుగుదేశం పార్టీ, తర్వాత 5 ఏళ్లు వైఎస్సార్సీపీ మొత్తం 10 ఏళ్లలో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్‌గా మార్చేశారని నిప్పులు చెరిగారు. డ్రగ్స్ రవాణా, మాదక ద్రవ్యాలు వాడకంలో రాష్ట్రానికి నెంబర్ 1 ముద్ర వేశారని అన్నారు.
ఎంపీ కృష్ణదేవరాయలు పేరిట వైఎస్సార్సీపీ ట్వీట్- ఈసీకి ఫిర్యాదు - TDP Leaders on Visakha drug case
25 వేల కేజీల భారీ మాదక ద్రవ్యాలు బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరితే, తమ తప్పు ఏమీ లేదని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. టీడీపీ, వైఎస్సార్సీపీ, బీజేపీ పార్టీలకు సిగ్గుండాలని ఆక్షేపించారు. కేంద్ర, రాష్ట్రాల నిఘా వ్యవస్థ సపోర్ట్ లేకుండా, వేల కోట్ల డ్రగ్స్ తీరానికి ఎలా చేరుతాయని ఆమె ప్రశ్నించారు. డ్రగ్స్ మాఫియాతో మీకు లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా అని నిలదీశారు. పార్టీల అండదండలతోనే కదా డ్రగ్స్ రవాణాలో ఏపీ "సేఫ్ హెవెన్" గా మార్చిందని ఆమె ఆరోపించారు. తెర వెనుక ఎంతటి వాళ్లున్నా నిజాలు నిగ్గు తేల్చాలని సీబీఐని కోరుతున్నామని తెలిపారు. ఆసియాలోనే అతి పెద్ద డ్రగ్ డీల్‌గా పరిగణించే ఈ మాఫియా వెనుక, ఎవరున్నారో తేల్చేందుకు, పారదర్శక విచారణ సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
"డ్రగ్స్ రవాణా, వినియోగంలో ఏపీకి నంబర్ వన్ ముద్రవేశారు. విశాఖలో చిక్కిన డ్రగ్స్‌పై పరస్పరం నిందలు వేసుకుంటున్నారు. నిఘా వ్యవస్థకు తెలియకుండా రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఎలా వస్తాయి? ఈ కేసులో తెర వెనుక ఎంతటి పెద్ద వాళ్లు ఉన్నా నిగ్గుతేల్చాలని సీబీఐని కోరుతున్నా. ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చేందుకు,పారదర్శక విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం." వైఎస్ షర్మిల ట్వీట్
జగన్ జమానాలో మాదకద్రవ్యాల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్! - AP become a drug state