AP Micro Irrigation Farming in YSRCP Govt: తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులను సాధించడమే సూక్ష్మసేద్యం. రివర్స్ పాలకుడు జగన్ మరోలా అర్థం చేసుకున్నారు. అందుకేనేమో ఈ విధానంలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని అయిదో స్థానానికి దిగజార్చారు. 18.60 లక్షల ఎకరాల నుంచి 4.39 లక్షల ఎకరాలకు దించేశారు. జగన్ వ్యవ'సాయం' ఏపాటిదో చెప్పేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. సూక్ష్మసేద్యం ప్రాధాన్యాన్ని గుర్తెరిగిన నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బిందు, తుంపర సేద్యానికి రైతు దరఖాస్తు చేస్తే చాలు ఉద్యాన సిబ్బందితోపాటే సంబంధిత సంస్థ ప్రతినిధులు వచ్చి పొలంలో పరికరాలను బిగించి వెళ్లేవారు.
జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే ఉద్యాన రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రాయితీలకు కత్తెరేశారు. ముఖ్యంగా సూక్ష్మసేద్యం అమలును పూర్తిగా పక్కన పెట్టేశారు. పరికరాలు సరఫరా చేసిన సంస్థలకు చుక్కలు చూపించారు. రైతుల్ని సతాయించారు. "మీ తిప్పలు మీరు పడాల్సిందే, మేమైతే పైసా ఇవ్వబోం"అని మూడేళ్లపాటు వేధించారు. దీంతో ఒక్కో రైతు లక్షకు పైగా ఖర్చు చేసి పరికరాలు బిగించుకోవాల్సి వచ్చింది.
గుట్టుచప్పుడు కాకుండా మోపాడు రిజర్వాయర్ నీరు విడుదల - ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు
వైసీపీ ప్రజాప్రతినిధులు, అందులో రాయలసీమ నాయకుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవడంతో 2022-23 నుంచి అమలు తిరిగి ప్రారంభించారు. అదీ అరకొరగానే. వంద మంది రైతులకు పరికరాలు కావాలంటే పదిమందికి ఇచ్చి సరిపెట్టుకోమనే దుస్థితి. మూడు నెలలుగా ఈ పథకం మరింత నత్తనడకన సాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత సూక్ష్మసేద్యానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పేరిట ప్రత్యేక ప్రణాళికలను అమలు చేసింది. కేంద్రం ఇచ్చే రాయితీలకు తోడు రాష్ట్రం అదనంగా నిధులు కేటాయించింది. దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.
తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్య 6.60 లక్షల మంది రైతులకు 18.59 లక్షల ఎకరాలకు సూక్ష్మసేద్య పరికరాలు అందించింది. నాడు సూక్ష్మసేద్యం అమలులో అగ్రస్థానంలో ఉన్న దేశంలోని తొలి పది జిల్లాల్లో తొమ్మిది ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాయి. అనంతపురం, కడప, చిత్తూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలు వరసగా అగ్రస్థానం పొందగా 10వ జిల్లాగా పశ్చిమగోదావరి నిలిచింది. దేశంలో కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. మొత్తం సాగు విస్తీర్ణంలో బిందుసేద్యంలో 25శాతం, తుంపరసేద్యంలో 17శాతం వాటా సాధించింది.
జగన్ సీఎం అయినప్పటి నుంచి సూక్ష్మసేద్యం రైతులకు అగచాట్లు మొదలయ్యాయి. నాబార్డు ద్వారా కేంద్రం ఇచ్చిన 616 కోట్లను తీసుకున్నారు. కానీ, ఒక్క ఎకరాకూ పరికరాలివ్వలేదు. కొందరు రైతులు లక్షల్లో ఖర్చు చేసి సొంతంగా పరికరాలు కొనుగోలు చేసుకున్నారు. టీడీపీ హయాంలో సూక్ష్మసేద్య పరికరాలను సరఫరా చేసిన సంస్థలపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితోనే వ్యవహరించింది. 950 కోట్లకుపైగా బిల్లుల్ని నాలుగేళ్లపాటు నిలిపేసింది.
ఉద్యానవన పంటల రైతులకు వైఎస్సార్సీపీ సర్కార్ మొండిచేయి!
ఇలాగైతే పరికరాలను ఇవ్వలేమని వారు హెచ్చరించడంతో బిల్లులు చెల్లించింది. సూక్ష్మసేద్య విస్తీర్ణమూ 4.39 లక్షల ఎకరాలకే పరిమితమైంది. కేంద్రం లోక్‌సభకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలోని మొత్తం సూక్ష్మసేద్య విస్తీర్ణంలో కర్ణాటక 21.59 శాతం, తమిళనాడు 13.16 శాతం, గుజరాత్ 13.02 శాతం, మహారాష్ట్ర 11.24 శాతం, ఆంధ్రప్రదేశ్ 11.02 శాతం వాటా కలిగి ఉన్నాయి. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఐదో స్థానానికి దిగజారింది.
2014 నుంచి 2019 మార్చి వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 59,500 మంది ఎస్టీ రైతులకు 16.71 కోట్ల విలువైన సూక్ష్మసేద్యం పరికరాలను రాయితీపై అందించారు. రైతన్నలకు సమున్నత అవకాశాలు కల్పించారు. ఐదేళ్ల జగన్ పాలనలో కేవలం 232 మందికి 1.23 కోట్ల విలువైన పరికరాలను మాత్రమే అందజేశారు. తెలుగుదేశం హయాంలోని ఎస్టీ లబ్ధిదారుల సంఖ్యతో పోలిస్తే ఒక్క శాతం మందికైనా వైసీపీ ప్రభుత్వం పరికరాలు ఇవ్వలేకపోయింది.
పని చేసేది పది పైసలైతే చెప్పేది మాత్రం నూటపది పైసలన్నట్లుగా జగన్ సర్కారు తీరు ఉంటోంది. పైగా దీనికి నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలంటూ ప్రచారం చేసుకోవడం పరిపాటిగా మారింది. జగన్ వచ్చాక వారికి ప్రత్యేకంగా చేసిన మేలేమీలేదు. వ్యవసాయంలో అయితే మరింత మొండిచేయి చూపిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని రైతులకు సూక్ష్మసేద్యం ద్వారా అధిక ప్రయోజనాలు కల్పించవచ్చని గత ప్రభుత్వం గుర్తించి అదనంగా ప్రోత్సాహకాలు కల్పించింది. అసలు పథకాన్నే మూలన పెట్టేసిన జగన్ ఎస్టీ రైతులకు తీరని ద్రోహం చేశారు.
నీరిస్తామన్నారని వరి వేసిన అన్నదాతలు- పంట కోతకొచ్చే వేళ చేతులెత్తిన అధికారులు