AP High Court on Sand Price: అధిక ఇసుక ధర కారణంగా సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఇసుక ధర పసిడితో పోటీ పడుతోందని వ్యాఖ్యానించింది. మైనింగ్ అనుమతులు పొందిన సంస్థలు అధిక ధరలు వసూలు చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది.
ప్రభుత్వానిదే బాధ్యత: 5 ఎకరాల్లో అనుమతులు తీసుకొని, 50 ఎకరాల్లో అక్రమంగా ఇసుకను తవ్వుతున్నారని పేర్కొంది. రీచ్‌ల్లో ఏం జరుగుతుందో అధికారులకు తెలియడం లేదని, ఇసుక తవ్వకం, తరలింపుపై మైనింగ్ అధికారులు నియంత్రణ కోల్పోయారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రజలకు ఇసుక ధర అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హైకోర్టు పేర్కొంది.
ఈడీకి ఏపీ కనిపించదా - అధికార పార్టీ ఇసుక దందా ఎన్ని వేలకోట్లో!
ప్రభుత్వం వద్ద యంత్రాంగం లేదు: ఇసుక ధరను ఏవిధంగా నిర్ణయిస్తున్నారని, నియంత్రించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నలు సంధించింది. వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుకను ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద యంత్రాంగం లేదని పేర్కొంది. లారీ ఇసుకను రూ. 20 నుంచి 30 వేల రూపాయలకు విక్రయించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అధిక ధరల నుంచి సామాన్యులను ఎలా రక్షిస్తున్నారో వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మండల స్థాయిలో ఓ పాయింట్‌ను ఏర్పాటు చేసి, ఇసుకను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని తెలిపింది. అనుమతులు లేకుండా వివిధ ఇసుక రీచ్‌ల్లో జీసీ కేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ (GCKC Projects and Works PVT LTD) సంస్థ భారీ యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం (Ministry of Environment and Forests) ఆధారాలతో కోర్టుకు నివేదిక ఇచ్చినట్లు పేర్కొంది.
కలెక్టర్లతో మేనేజ్ చేశారు - శాఖ శాటిలైట్ చిత్రాలతో దొరికిపోయారు!
వాహనాల వేగంపై నియంత్రణ అవసరం: కేంద్ర నివేదికపై వివరణ ఇస్తూ అఫిడవిట్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రీచ్‌ల నుంచి ఇసుక రవాణా విషయంలోనూ ఎంవోఈఎఫ్ మార్గదర్శకాలు పాటించాల్సిందేనంటూ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రీచ్‌లున్న ప్రాంతాల్లోని స్థానికులతో కలిసి అధికారులు రవాణా మార్గాలను నిర్ణయించాలని సూచించింది. ఇసుక రవాణా వాహనాల వేగంపై నియంత్రణ అవసరమని, స్థానిక ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని పేర్కొంది.
ఇసుక రవాణా మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు నిపుణుల సూచనలు, సలహాలు అవసరమని తెలిపింది. గోవా రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌ను నిలువరించడంలో కీలకపాత్ర పోషించిన ఓ మహిళా సీనియర్ న్యాయవాదిని అమికస్‌క్యూరీగా (Amicus Curiae) నియమించింది. దీనిపై తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇసుకను ఊడ్చేస్తున్న వైసీపీ నేతలు- ఎన్జీటీ విచారణలో అధికారులకే చిక్కులు!