AP Govt Takes Special Steps for Araku Valley: అరకులోయ అందాలను పర్యాటకులకు మరింత చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతోంది. అతిథి గృహాల నిర్మాణంతో పాటు సహజ అందాలకు సొబగులు అద్దుతోంది. హాట్ బెలూన్, పారా మోటర్ గ్లైడింగ్ వంటి సాహస సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తోంది.
సహజసిద్ధమైన అందాలకు నెలవు అరకు లోయను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం 'ప్రసాద్'లో భాగంగా అరకులోయ ప్రాంత అభివృద్ధికి కొత్త బాటలు వేస్తోంది. సందర్శకులను మరింతగా ఆకట్టుకునేందుకు పాడేరు ఐటీడీఏ ప్రత్యేక ప్రాజెక్టులు చేపడుతోంది. 30 కోట్ల రూపాయలతో పర్యాటక అతిథి గృహాలకు మరమ్మతులు చేపట్టారు. సందర్శకుల కోసం మరిన్ని విడిది గృహాలను సిద్ధం చేస్తున్నారు. పద్మాపురం ఉద్యానవనంలో కొత్తగా ఐటీడీఏ ఆధ్వర్యంలో ట్రీహట్స్‌ను నిర్మించారు. పచ్చని పూల మొక్కల నడుమ ట్రీహట్స్ శోభాయమానంగా వెలుగులీనుతున్నాయి. ఇక్కడే సహజ సిద్ధంగా ఏర్పడిన రాళ్లతో ఏర్పాటు చేసిన వాటర్‌ఫౌంటెన్ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది.
సాహసోపేత అనుభవాలు సొంతం చేసుకోవాలనే పర్యాటకుల కోసం పద్మాపురం ఉద్యానవనంలో హాట్ బెలూన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీని కోసం ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు. కొత్తవలస ఉద్యానంలో పారా మోటార్ గ్లైడింగ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రయ్ రయ్‌మంటూ ఆకాశంలోకి దూసుకెళ్లి అల్లంత ఎత్తు నుంచి అరకులోయ అందాలను వీక్షించే అవకాశం తీసుకొస్తున్నారు.
పాడేరుకు పోదాం- ఎయిర్ బెలూన్‌లో విహరిద్దాం!
కొత్తవలస ప్రదర్శన క్షేత్రంలో సుమారు 100 రకాల ఔషధ మొక్కల పెంపకాన్ని చేపట్టి పర్యాటకులకు పరిచయం చేసే వీలు కల్పించారు. గిరిజన మ్యూజియంతోపాటు పద్మాపురం ఉద్యానవనాన్ని విద్యుద్దీపాలతో అలంకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే స్కిస్‌ఫామ్ వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో అరకు పైనరీని ఏర్పాటు చేశారు. ఇక్కడ పైన్ వృక్షాల మధ్య సెల్ఫీలు దిగుతూ సందర్శకులు సందడి చేస్తున్నారు. ఫొటోషూట్‌లతో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.
అరకు లోయ నుంచి లంబసింగి వరకు పర్యాటక కారిడార్‌ను ఏర్పాటుచేసి సందర్శకులకు కొత్త సోయగాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఐటీడీఏ పర్యాటకశాఖ చర్యలు చేపడుతోంది. అరకులోయ సమీపంలోని గిరి గ్రామదర్శిని మరో కలికితురాయి. ఇక్కడ గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తోంది. గిరిజన వస్త్రధారణ, ఆచారాలు పాటిస్తూ వివాహం చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
"అరకు కాఫీ" అదుర్స్ - రైతుల కష్టాలకు చెక్ పెట్టిన టెకీ నిర్ణయం
అరకులో ఈ జాలువారే తారాబు జలపాతం ఆందాలను తప్పక చూడండి - Tarabu Waterfalls Araku