AP government takes back Saraswati Power lands: సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌లోని అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల్లో ఉన్న అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటూ మాచవరం తహసీల్దార్ ఉత్తర్వులు ఇచ్చారు. మాచవరం మండలం వేమవరం గ్రామ పరిధిలో 13 ఎకరాల 80 సెంట్లు, అదే విధంగా పిన్నెల్లి గ్రామంలో 3 ఎకరాల 89 సెంట్ల అసైన్డ్ భూములు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కింద ఉన్నట్లు తేల్చారు. గతంలో వేమవరానికి చెందిన 19 మంది వ్యక్తులకు ఈ 13 ఎకరాల 80 సెంట్లు భూమిని కేటాయించారు.
పిన్నెల్లి గ్రామంలో 3 ఎకరాల 89 సెంట్ల అసైన్డ్ భూమిని ముగ్గురికి కేటాయించారు. మెుత్తం 17 ఎకరాల 69 సెంట్ల అసైన్డ్ భూముల్ని స్వాధీనం చేసుకున్నట్లు మాచవరం తహసీల్దార్ ప్రకటించారు. గురజాల నియోజకవర్గం పరిధిలోని మాచవరం, దాచేపల్లి మండలాల పరిధిలో 15 వందల ఎకరాలకు పైగా భూములను సరస్వతి సంస్థ కోసం అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కేటాయించింది. అయితే దాదాపు 15 ఏళ్లు గడుస్తున్నా ఇక్కడ ఎలాంటి పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడంతో భూములిచ్చిన రైతులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు చెందిన భూముల్లో రెవెన్యూ, అటవీ, చెరువులు, కుంటలకు చెందిన భూములు ఉంటే గుర్తించాలంటూ సర్వేకు ఆదేశించారు. స్వయంగా వెళ్లి భూముల్ని పరిశీలించారు. ఇక్కడ అసైన్డ్ భూములు ఉన్నట్లు గుర్తించిన అధికారులు, వాటిని స్వాధీనం చేసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు.
సరస్వతి ఇండస్ట్రీస్ భూముల్లో అసైన్డ్ ల్యాండ్ - నోటీసులు జారీ