AP Election New Candidates for State Legislature : రాష్ట్ర అసెంబ్లీలోకి కొత్తగా 81 మంది అడుగుపెట్టనున్నారు. వీరిలో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన వారితో పాటు గతంలో కేంద్ర మంత్రులుగా పని చేసిన సుజనాచౌదరి, కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి కూడా ఉన్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. విశాఖ, అనకాపల్లి, ప్రకాశం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున గెలుపొందారు. కూటమి ప్రభంజనంతో అనేక మంది వారసుల అరంగేట్రం సాఫీగా సాగిపోయింది.
వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకోవడం సర్వసాధారణమే కానీ, వారిని గెలిపించుకుని చట్టసభల్లోకి పంపడం అంత సులభం కాదు. కానీ కూటమి ప్రభంజనంతో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి కుమార్తె యనమల దివ్య, ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థులుగా దివంగత వరుపుల రాజా సతీమణి సత్యప్రభ గెలుపొందారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేశ్ మంగళగిరిలో గెలిచారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ తరపున సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష పోటీచేసి మంత్రి సీదిరి అప్పలరాజును మట్టికరిపించి అసెంబ్లీలో అడుగిడనున్నారు. హిందూపురంలో హ్యాట్రిక్ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీభరత్ విశాఖ ఎంపీగా గెలిచారు.
రాజంపేట లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి చవిచూడగా ఆయన సోదరుడు కిశోర్‌కుమారెడ్డి పీలేరులో టీడీపీ నుంచి గెలిచారు. అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి గెలిచారు. మాజీమంత్రి పల్లె రఘునారెడ్డి కోడలు సింధూర రెడ్డి పుట్టపర్తి నుంచి గెలిచారు. కర్నూలులో టీజీ వెంకటేశ్ కుమారుడు భరత్ గెలిచారు.
మచిలీపట్నంలో టీడీపీ నేత కొల్లు రవీంద్రపై మాజీమంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తి పోటీచేసి ఓడిపోయారు. చీరాలలో వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్ పోటీ చేసి ఓడిపోయారు. తాడిపత్రి, ధర్మవరం స్థానాల నుంచి పోటీచేసిన బాబాయ్ అబ్బాయిలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓడారు. గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి ఓటమి చవిచూశారు.
అనిల్ ఔట్! కోతల నేతకు ఓట్లతో వాతలు - YSRCP Leader Anil Kumar Yadav
తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏలూరు ఎంపీ స్థానంలో ఆయన కుమారుడు సునీల్ కుమార్ వైఎస్సార్సీపీ నుంచి పోటీచేసి ఓడారు. ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రగిరిలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి పరాజయం పాలయ్యారు. ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి లోక్‌సభ స్థానంలోనూ, ఆయన కుమార్తె ఈర్లె అనురాధ మాడుగుల అసెంబ్లీ స్థానంలోనూ ఓటమి చవిచూశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ కొండపిలోను, ఆయన సోదరుడు సతీష్ కోడుమూరులోను పరాజయం పాలయ్యారు.
మేకపాటి రాజగోపాలరెడ్డి ఉదయగిరి, ఆయన అన్న కుమారుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు స్థానాల నుంచి పోటీచేసి ఓడారు. మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం ఘోర పరాజయం పాలైంది. చీపురుపల్లిలో బొత్స, గజపతినగరం అసెంబ్లీ స్థానంలో తన తమ్ముడు అప్పలనరసయ్య ఓడిపోయారు. బొత్స ఝాన్సీలక్ష్మీ విశాఖ లోక్‌సభ స్థానంలో ఓడారు. బొత్స మేనల్లుడు చిన్న శ్రీనుకు వియ్యంకుడైన బడ్డుకొండ అప్పలనాయుడు కూడా నెల్లిమర్లలో ఓడారు.
సీఎం పదవికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా - YS Jagan Mohan Reddy Resign As CM
రాష్ట్ర శాసనసభలోకి ఇద్దరు విశ్రాంత ఐఏఎస్‌లు, లోక్‌సభలోకి విశ్రాంత ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు అడుగుపెట్టనున్నారు. ఈ నలుగురూ కూటమి తరపున పోటీచేసే గెలిచారు. బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తెన్నేటి కృష్ణప్రసాద్ విజయం సాధించారు. చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ ఐఆర్ఎస్ అధికారి దగ్గుమళ్ల వరప్రసాద్ గెలుపొందారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచిన విశ్రాంత ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ విజయం సాధించారు. మరో మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు పల్నాడు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.
కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఇంతియాజ్ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ చేతిలో ఓడిపోయారు. రాష్ట్ర కేడరుకు చెందిన ఈయన ఎన్నికలకు ముందు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. బాపట్ల పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జేడీ శీలం మరోసారి ఓటమి చవిచూశారు. ఈయన గతంలో కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓటమి చవిచూశారు.