AP CEO Mukesh Kumar Meena Review on 2024 Elections : ఎన్నికల అభ్యర్ధుల ఆర్ధిక లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా బ్యాంకింగ్ అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్ధుల వ్యయాలకు సంబంధించి ప్రత్యేకించి బ్యాంకు లావాదేవీల వ్యవహారాన్ని కచ్చితంగా తెలియ జేయాల్సిందిగా సీఈఓ (Chief Electoral Officer) ఆదేశించారు. అభ్యర్ధుల వ్యయానికి సంబంధించి రాష్ట్ర సచివాలయంలో బ్యాంకర్లతో ఆయన సమావేశం నిర్వహించారు.
అభ్యర్ధులు చేసే వ్యయం, బ్యాంకులు విడుదల చేసే నిధులకు సంబంధించిన ఈసీ మార్గదర్శకాల మేరకు పరిమితులు తదితర అంశాలను చర్చించారు. ఒక్క రోజులో రూ. 10 లక్షలు, నెల రోజుల వ్యవధిలో రూ. 50 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు జరిగితే ఆ వివరాలను సమర్పించాల్సిందిగా ఎన్నికల సీఈఓ ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ ఈసీకి, ఆదాయపు పన్ను శాఖకు ఇవ్వాల్సిన సమాచారం, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టం అమలు చర్యలపై ప్రధానంగా చర్చించారు. సోదాల్లో దొరికిన డబ్బు, ఎన్ఫోర్సుమెంట్ ఏజెన్సీలు పర్యవేక్షించాల్సిన అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.
జీరో వయొలెన్స్, నో రీపోల్ ప్రధాన మంత్రాలు కావాలి: ముఖేష్ కుమార్ మీనా
పెయిడ్ న్యూస్‌పై ప్రత్యేక దృష్టి : హింసలేని, రీపోలింగ్‌కు ఆస్కారం లేని ఎన్నికలే లక్ష్యంగా ఈసారి ఎన్నికలు నిర్వహణ ఉంటుందని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా ఎస్పీలదే బాధ్యతని స్పష్టం చేశామన్నారు. ఘటనపై తక్షణం చర్యలు తీసుకోకపోతే సదరు ఎస్పీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల కోడ్ అమలు నుంచి పెయిడ్ న్యూస్‌పై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు.
పార్టీ అనుబంధ ఛానళ్లలో అనుకూల వార్తలు వస్తే ఆ వ్యయాన్ని సదరు పార్టీ, అభ్యర్ధుల ఖాతాల నుంచే చేసిన వ్యయంగా భావిస్తామన్నారు. ఎంసీఎంసీ (Media Certification and Monitoring Committee) కమిటీలు ఈ తరహా వార్తలను, ప్రచారాలను నిశితంగా పరిశీలన చేస్తున్నాయన్నారు. ఇప్పటి వరకూ అన్ని రాజకీయ పార్టీల నుంచి 155 ప్రకటనల కోసం ఈసీకి దరఖాస్తులు వచ్చాయని, ఎమ్మెల్యేకు 40 లక్షలు, ఎంపీ అభ్యర్ధికి 95 లక్షల వ్యయాన్ని మాత్రమే ఈసీ ఎన్నికల వ్యయంగా అనుమతించిందన్నారు. నామినేషన్ల చివరి తేదీ నుంచి అభ్యర్ధుల ఎన్నికల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ ప్రచారంలో పాల్గొనకూడదని సర్వీసు నిబంధనల్లోనే ఉందని, అలాంటి ఉదంతాలు వస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.