AP CABINET MEETING DECISIONS: అసాంఘిక, సంఘ విద్రోహ శక్తుల పీచమణిచేలా ముందస్తు నిర్బంధ చట్టం (పీడీ యాక్ట్)లో కీలకమైన మార్పులు చేస్తూ రూపొందించిన చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ చట్టం పేరు, నిర్వచనం మార్చుతూ ప్రభుత్వం కొత్తగా 10కి పైగా నేరాల్ని దీని పరిధిలోకి తీసుకురానుంది. సోషల్ మీడియాలో అసభ్య, అభ్యంతరకర పోస్టులతో చెలరేగిపోతున్నవారిని సైతం పీడీ చట్టం పరిధిలోకి తీసుకురానుంది. భూకబ్జాదారులు, రేషన్ బియ్యం అక్రమ నిల్వతో పాటు రవాణా, విక్రయం, ఎగుమతులు వంటి నేరాలకు పాల్పడేవారిపైనా పీడీ చట్టం ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఎలక్షన్స్‌లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించింది. ఇప్పటికే కర్నూలు కేంద్రంగా పనిచేస్తున్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ (Human Rights Commission) వంటి న్యాయ సంబంధిత సంస్థల్ని అక్కడే కొనసాగించాలనే ప్రతిపాదనకు సైతం క్యాబినెట్లో ఆమోదించారు. కర్నూలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (Andhra Pradesh Electricity Regulatory Commission) కార్యాలయాన్ని రాజధాని అమరావతికి తరలించాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవీ.
హనీమూన్ ముగిసింది - ఇక మంత్రులు పట్టు సాధించాలి: చంద్రబాబు
పర్యాటకానికి పారిశ్రామిక హోదా: పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ప్రతిపాదనను ఆమోదించింది. గతంలో లేని విధంగా పర్యాటక ప్రాజెక్టులకు సైతం పెట్టుబడి రాయితీ ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాల్ని వీటికీ వర్తింపజేయాలని నిర్ణయించింది. మైక్రో ప్రాజెక్టులకు 1.50 కోట్ల రూపాయల వరకు, మధ్యతరహా వాటికి 7.5 కోట్ల రూపాయలు (ఇందులో మహిళలకు అదనపు ప్రోత్సాహం) మెగా ప్రాజెక్టులకు 25 కోట్ల రూపాయలు, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు 40 కోట్ల రూపాయల వరకు గరిష్ఠంగా రాయితీలు ఇస్తారు.
పర్యాటక విధానంపై చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పర్యాటకుల భద్రత, రక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కేరళలో స్థానిక నృత్యాలు, యుద్ధ కళలు, సంస్కృతుల్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నారని, ఏపీలోనూ థింసా వంటి ప్రత్యేక నృత్యాలు, కళలు, సంస్కృతులు ఉన్నాయని, వాటిని ప్రోత్సహించాలని సూచించారు. ‘టెక్స్‌టైల్ టూరిజం’ వంటి ప్రత్యేక కాన్సెప్ట్‌లను ప్రోత్సహించాలన్న ప్రతిపాదనలు వచ్చాయి.
అవిశ్వాస తీర్మానాలపై గడువు రెండేళ్లకి కుదింపు - క్యాబినెట్ సంచలన నిర్ణయాలు
హరియాణాకు మించి ప్రోత్సాహకాలు: క్రీడాకారులను ప్రోత్సహించడం, వారికి నగదు పురస్కారాలు అందించడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న హరియాణాను మించి ఆంధ్రప్రదేశ్‌లో ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కొత్త క్రీడల విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై చర్చ సందర్భంగా స్థానిక క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలని, పాఠశాలల్లో క్రీడా కాంప్లెక్సులు ఏర్పాటు చేయాలని, స్థానిక ప్రతిభను ప్రోత్సహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దివ్యాంగులు క్రీడా పోటీలకు సన్నద్ధమవుతున్నప్పుడే సహాయం చేయగలిగితే మరింతగా రాణించే వీలుంటుందని ఆయన సూచించారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెంచిన పన్ను తగ్గింపు:
- సహజవాయువుపై 5 శాతం ఉన్న వ్యాట్‌ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం 24.5%కి పెంచేసింది. దాన్ని తిరిగి 5 శాతానికి తగ్గించే ప్రతిపాదనకు ఆమోదం
- లోకాయుక్త అర్హతలు, ఎంపికకు సంబంధించిన చట్ట సవరణ బిల్లుకు ఆమోదించారు. ఈ ఎంపిక కమిటీలో ప్రధాన ప్రతిపక్ష నేత సైతం సభ్యుడిగా ఉంటారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఎవరికీ లేకపోతే ఆ స్థానంలో చట్టసభలోని ఎవరినైనా ఒకరిని నియమించేలా చట్టసవరణ చేసే ప్రతిపాదనకు ఆమోదం
- గంజాయి, మాదకద్రవ్యాల్ని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన యాంటీ నార్కొటిక్ టాస్క్‌ఫోర్స్‌కు ఈగల్ (Elite Anti-Narcotics Group for Law Enforcement) అని పేరు పెట్టాలని చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు సమ్మతి
- కాంట్రాక్టర్లకు జగన్ ప్రభుత్వం రద్దు చేసిన మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానం పునరుద్ధరణకు గ్రీన్‌సిగ్నల్
- ఏపీ ఫైబర్‌నెట్‌లో (Andhra Pradesh State FiberNet) ఏపీ టవర్స్ కార్పొరేషన్‌ను విలీనం చేసే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం
భూ కబ్జా చేశారో అంతే సంగతులు - కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
ఆ రెండు బిల్లులు వాయిదా: స్థానిక సంస్థల్లో మేయర్, ఛైర్మన్, జడ్పీ ఛైైర్మన్ వంటి పదవుల్లో ఉన్నవారిపై ఎన్నికైనప్పటి నుంచి నాలుగేళ్ల వరకు అవిశ్వాసం పెట్టడానికి వీల్లేదన్న నిబంధనను రెండున్నరేళ్లకు కుదిస్తూ రూపొందించిన మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాల సవరణ బిల్లుల్ని వాయిదా వేశారు. వాటిపై తర్వాత సమావేశాల్లో కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
చర్చల తీరుపై చంద్రబాబు సంతృప్తి: అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా, ప్రజలకు సంబంధించిన కీలకాంశాలపై చర్చలు చక్కగా సాగుతున్నాయని, సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా రెండు రోజులు సైతం సమావేశాలు విజయవంతంగా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు.
డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం - 1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యం