Anna Canteens to Be Reopened By Chandrababu Government : అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. శనివారం నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. సెప్టెంబరు 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. వీటి పునరుద్ధరణ దస్త్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సంతకం పెట్టడంతో అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు. పుర, నగరపాలక సంస్థల కమిషనర్లతో పాటు ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను ఇందులో భాగస్వాములను చేశారు. 2019లో ప్రారంభించిన క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. గతంలో మంజూరుచేసిన 203 క్యాంటీన్ భవనాల్లో 184 వరకు అప్పట్లో పూర్తయ్యాయి. పాత డిజైన్ మేరకు మిగిలిన వాటి నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం సూచించింది.
అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కార్యాచరణ ఇలా...
15.6.24: పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లు తమ పరిధిలోని క్యాంటీన్లను పరిశీలించి భవనం తాజా పరిస్థితి, ఫర్నిచర్, ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) పరికరాలు, ఇతర అవసరాలపై ప్రాథమిక నివేదిక రూపొందించాలి.
19.6.24: క్యాంటీన్ల పునరుద్ధరణకు పాత డిజైన్ ప్రకారం భవన నిర్మాణ పనులకు మున్సిపల్ ఇంజినీర్లు, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో కలిసి కమిషనర్లు అంచనాలు సిద్ధం చేయాలి.
30.6.24: ఇప్పటికీ భవన నిర్మాణాలు జరగని క్యాంటీన్లకు కొత్తగా పనులు చేపట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కమిషనర్లు స్థలాలను ఎంపికచేయాలి. క్యాంటీన్లలో నిర్వహిస్తున్న వార్డు సచివాలయాలను ఖాళీ చేయించి వాటికి ప్రత్యామ్నాయ భవనాలు చూడాలి.
30.7.24: క్యాంటీన్లకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సరఫరా చేసే ఏజెన్సీలను ఖరారు చేయాలి. ఐఓటీ పరికరాల సమీకరణ, క్యాంటీన్ల పర్యవేక్షణ, స్మార్ట్ బిల్లింగ్, విరాళాల నిర్వహణకు సాఫ్ట్‌వేర్ కోసం సంస్థలను ఖరారు చేయాలి.
10.8.24: క్యాంటీన్ భవన నిర్మాణ పనులు, కొత్తపరికరాలు, సాఫ్ట్‌వేర్ సమీకరణ, ఇతర మౌలిక సదుపాయాలకు ఏజెన్సీలతో చేసుకున్న ఒప్పందాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలి.
15.8.24: మిగిలిన క్యాంటీన్ భవనాల నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థలతో అగ్రిమెంట్ చేయాలి. తాగునీరు, విద్యుత్తు, ఇంటర్నెట్ సహా సదుపాయాలన్నీ కల్పించాలి.
21.9.24: పుర, నగరపాలక సంస్థల్లో 203 క్యాంటీన్లను సెప్టెంబరు 21లోగా ప్రారంభించాలి.