Anna Canteens Reopen From August 15th : ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో అన్న క్యాంటీన్లను ఆగస్టు 15న పునఃప్రారంభించడానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పేదలకు పట్టెడన్నం పెట్టే అన్నం క్యాంటీన్లను చంద్రబాబు ప్రభుత్వం పునరుద్దరించడంపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీడీపీ హయంలో రూపుదిద్దుకున్న అన్నా క్యాంటీన్లను జగన్ మోహన్ రెడ్డి సర్కార్ రాష్ట్రంలో కొలువుదీరాక నిలిపివేశారు. దీనిపై అప్పటిలోనే వివిధ తరగతి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా జగన్ సర్కార్ వెనక్కు తగ్గలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో అన్నా క్యాంటిన్లను తిరిగి అందుబాటులోకి తెస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో చాలా అన్నా క్యాంటిన్ కేంద్రాలను ఇతర అవసరాలకు వినియోగించారు. ప్రస్తుతం వాటన్నింటిని స్వాధీనం చేసుకుని పాత మోడల్లోనే అన్నా క్యాంటిన్లుగా తిరిగి రూపుదిద్దుతున్నారు.
అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం పెట్టడంతో అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు. పుర, నగరపాలక సంస్థల కమిషనర్లతో పాటు ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను ఇందులో భాగస్వాములను చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో నగరంలోని ఇతర అవసరాలకు వినియోగించిన అన్నా క్యాంటిన్ బిల్డింగ్లను స్వాధీనం చేసుకుని ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు.
అన్నా క్యాంటీన్ల భవనాలను ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇదే విషయంపై ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు చర్యలు వేగవంతం చేశారు. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం 11 అన్నా క్యాంటిన్లు ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. అన్నా క్యాంటిన్లను తిరిగి ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అన్నా క్యాంటిన్లు ప్రారంభమైతే ఇతర అవసరాల కోసం నగరానికి వచ్చే వారికి తక్కువ ధరకే ఆకలి తీరుతుంది. ప్రస్తుతం నగరంలో ఏదైనా పని ఉండి వస్తే బయట టిఫన్, ఒక పూట భోజనం చేస్తే కనీసం 130 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రజలు చెబుతున్నారు. అన్నా క్యాంటిన్లు ప్రారంభమైతే రోజు వారీ కూలీలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, నిరుద్యోగులు వంటి వారికి తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నా క్యాంటిన్లను ఎప్పుడు తెరుస్తారా అని తాము ఎదురు చూస్తున్నామని ప్రజలు చెబుతున్నారు. ఆగస్టు మొదటి వారం నాటికి నగరంలోని అన్ని అన్నా క్యాంటిన్లను ప్రారంభానికి సిద్ధం చేస్తామని వీఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పనులు చివరి దశలు చేరుకున్నాయని అధికారులు తెలిపారు.
తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పేదలకు పండగే: బొండా ఉమా - Bonda Uma about Anna Canteen