Planning to change Intermediate Syllabus to CBSE in AP : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌లో సీబీఎస్‌ఈ సిలబస్ అమలు చేయనున్నారు. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. సీబీఎస్‌ఈ సిలబస్ అమలులోకి వస్తే గణితంలో దాదాపు 30 శాతానికి పైగా సిలబస్ తగ్గుతుంది. రసాయన, భౌతికశాస్త్రాల్లోనూ సీబీఎస్‌ఈతో పోల్చితే రాష్ట్ర బోర్డు సిలబస్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం గణితంలో రెండు పేపర్ల విధానం ఉంది. మరి దాన్ని ఒకటి చేయాలా? రెండుగానే ఉంచాలా? అని దానిపై కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటికే సిలబస్ మార్పుపై ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతోనూ విద్యా మండలి సమావేశాలు నిర్వహించింది. మరోవైపు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ కోచింగ్ ఇచ్చేలా ఇంటర్మీడియట్ విద్యాశాఖ యోచిస్తోంది. కార్పొరేట్ కాలేజీల సహకారంతో దీన్ని నిర్వహించాలని ఆలోచిస్తోంది, ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు కోచింగ్ క్లాసుల నిర్వహణపై శిక్షణ ఇచ్చి, విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్ అందించాలనుకుంటోంది.
షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు : ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉమ్మడి త్రైమాసిక పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. ప్రైవేటు మినహా అన్ని యాజమాన్యాలూ ఇదే షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని, మార్కులను ఆన్లైన్లోనే నమోదు చేయాలని ఆదేశించింది.
ప్రశ్నపత్రాలను బోర్డు ఆన్‌లైన్‌లో పంపిస్తుందని, కళాశాలలు వాటిని జిరాక్స్ తీసుకొని పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. అక్టోబర్ 15 నుంచి 21 వరకు ఈ జరగనున్నాయని వెల్లడించింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బోధన సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు అకడమిక్ మార్గదర్శక, పర్యవేక్షణ విభాగాల ఏర్పాటుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.