AP Cabinet Meeting Decisions 2024 : సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం తొలిసారి భేటీ అయింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీకి సమ్మతి తెలిపింది. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని నిర్ణయించింది.
Andhra Pradesh Cabinet Meeting Key Decisions : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు దస్త్రానికి కేబినెట్ సమ్మతి తెలిపింది. గతంలోలానే రిజిస్ట్రేషన్ తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి పింఛన్ రూ.4,000లకు పెంచేందుకు ఆమోదముద్ర వేసినమంత్రివర్గం బకాయిలతో కలిపి జులై 1న ఇంటివద్దే రూ.7,000లు ఇవ్వాలని నిర్ణయించింది.
"పెంచిన పింఛను మొత్తం రూ.4,000 జులై 1 నుంచే ఇస్తాం. మూడు నెలల బకాయిలు కలిపి జులై 1న రూ.7,000లు ఇస్తాం. పింఛను పెంపు వల్ల 65 లక్షల మందికి లబ్ధి కలుగుతుంది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ వెళ్లి పింఛను అందిస్తాం. కొన్నిరకాల వ్యాధుల బాధితులకు రూ.10,000లు పింఛను ఇస్తాం." - కొలుసు పార్థసారథి, సమాచార శాఖ మంత్రి
ఆరోగ్య విశ్వవిద్యాలయానికి తిరిగి ఎన్టీఆర్ పేరు : విజయవాడలోని వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి తిరిగి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో ఎన్టీఆర్ పేరుతోనే ఉన్న యూనివర్సిటీని వైసీపీ ప్రభుత్వం పేరు మార్చిందన్న మంత్రి పార్థసారథి, ఫలితంగా అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. విద్యార్థులతో పాటు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతుల మేరకు పాత పేరునే పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు.
అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి కుటుంబాన్ని ఓ యూనిట్‌గా తీసుకుని సర్వే చేసి ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి కోసం నైపుణ్య గణన చేస్తామన్న మంత్రి పార్థసారథి, వ్యవసాయ రంగంలోనూ నైపుణ్య గణన చేపడతామన్నారు.
రాష్ట్రంలో గంజాయి నివారణకు హోంమంత్రి అనిత నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.
7 అంశాలపై శ్వేతపత్రాల విడుదల : గంజాయి నిర్మూలనపై ఉక్కుపాదం మోపాలని సీఎం స్పష్టం చేశారన్న మంత్రి పార్థసారథి, గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాల నియంత్రణకు ఈ కమిటీ సూచనలు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న వివిధ అక్రమాలపై 7 శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించినట్లు పార్థసారథి వెల్లడించారు. ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలడంపై మంత్రివర్గంలో చర్చించామన్న పార్థసారథి, వాటి కట్టడికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించినట్లు వెల్లడించారు.