Amaravati Drone Summit 2024 : మానవ వనరుల కొరత ఉన్న రంగాలకు డ్రోన్లు ఎలాంటి సేవలు అందిస్తాయో అమరావతి డ్రోన్ సమ్మిట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు ఎంతమేర ఉంటాయి. ఇన్నాళ్లూ వివిధ రంగాల్లో ఉన్న అడ్డంకులను ఇవి ఎలా అధిగమిస్తాయి. సహాయ చర్యలకు ఎలా ఉపయుక్తంగా ఉంటాయి. ఇలాంటి అనేక ఆసక్తికర అంశాలు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో మంగళవారం ( అక్టోబర్ 22న) నిర్వహించిన డ్రోన్ సమిట్‌లో కళ్లకు కట్టినట్లు కనిపించాయి.
డ్రోన్లు ప్రదర్శన : బహుముఖ ప్రయోజనాలు అందించే డ్రోన్లు సందర్శకులతో పాటు ఈ రంగంలోకి అడుగు పెట్టాలనుకునే ఔత్సాహికులను ఉర్రూతలూగించాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న డ్రోన్లు అందించే సేవలు దేని కదే పూర్తిగా ప్రత్యేకం. దేశం నలుమూలల నుంచి డ్రోన్ తయారీదారులు పెద్ద ఎత్తున విజయవాడకు తరలివచ్చారు. వారు అంతా తాము రూపొందించిన, అభివృద్ధి చేసిన, దిగుమతి చేసుకున్న డ్రోన్లను ప్రాంగణం పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రదర్శించారు.
ఆపత్కాలంలో డ్రోన్లదే కీరోల్ - ప్రజాభద్రతలోనూ సమర్థ వినియోగం
డ్రోన్ల ప్రత్యేకతలు, పని తీరు : వీటిలో కొన్ని డ్రోన్లు ప్రయోగాత్మక దశలో, మరికొన్ని పరీక్ష స్థాయిలో ఉన్నాయి. మిగిలిన చాలా వరకు డ్రోన్లు ఇప్పటికే వినియోగంలో ఉన్నాయి. ఆయా డ్రోన్ల ప్రత్యేకతలు, వాటి పని తీరు వంటి వివరాలను సందర్శకుల అంతా నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కొందరు ఔత్సాహిక వ్యాపారులు ఆయా కంపెనీల డీలర్ షిప్‌లు తీసుకునేందుకూ ఆసక్తి చూపారు.
అసెంబుల్డ్ డ్రోన్‌లూ : వీటిని స్వయంగా తయారు చేసుకునేందుకు అవసరమైన స్మార్ట్ చిప్, మదర్ బోర్డు, వింగ్స్ తదితర పరికరాలను డ్రోన్ సమ్మిట్‌లో భాగంగా ఒకటి రెండు స్టాళ్లలో అందుబాటులో ఉంచారు. ఇప్పటికే వినియోగిస్తున్న డ్రోన్‌లు ఉంటే వాటికి ఏవైనా పరికరాలు పాడైనా, విరిగినా అలాంటి వాటిని ఇక్కడ తీసుకునే వెసులుబాటు కల్పించారు.
హైదరాబాద్ నుంచి విజయవాడకు 45 నిమిషాల్లో రావచ్చు. కానీ విమానంలో కాదు డ్రోన్‌లో! భారీ జన సమీకరణతో కూడిన బహిరంగ సభల్లో తొక్కిస లాటలు జరగకుండా పర్యవేక్షించి అక్కడున్న ప్రజలను డ్రోన్‌ల సాయంతో సురక్షిత మార్గంలో పంపొచ్చు. వ్యవసాయం, ప్రజాభద్రత, వైద్యం, రక్షణ వంటి పలు రంగాల్లో డ్రోన్ల సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. సమీప భవిష్యత్తులో వాటి వినియోగం మరి కొన్ని రంగాలకూ విస్తరించనుంది.
మత్స్య రంగం : చేపలకు మేత వేసేందుకు ‘ఏజీ365హెచ్’ (NG365H) పేరుతో మారుత్ డ్రోన్స్ రూపొందించిన డ్రోన్‌ను సీఎం చంద్రబాబు డ్రోన్ సమిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో ఆవిష్కరించారు. 10 లీటర్ల ట్యాంక్ సామర్థ్యం, 25,200 ఎంఏహెచ్ బ్యాటరీ (mAh battery), లైవ్ వీడియో స్ట్రీమింగ్-రికార్డింగ్, 4జీ కనెక్టివిటీ, డ్యూయల్ ఫ్లైట్ మోడ్ వంటి సౌకర్యాలతో పగలు, రాత్రి కూడా నడిచే ఈ డ్రోన్ రోజుకు 30 ఎకరాలను కవర్ చేస్తుంది. దీనికున్న కృత్రిమమేధ (AI - Artificial intelligence) సాయంతో పంట ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది. డ్రోన్లు ద్వారా ఎక్కడ ఎంతమేర పురుగు మందు పిచికారీ చేయాలో అంచనా వేసుకుని, అంతే పిచికారీ చేస్తుంది.
ఆకాశంలో అద్భుతం - అమరావతిలో డ్రోన్‌షో అదుర్స్
టేథర్డ్ డ్రోన్ నిఘారంగం : ఈ డ్రోన్లను నిఘా (Surveillance) కోసం వినియోగిస్తారు. ఇప్పటికే గుజరాత్ పోలీసులు ఈ తరహా డ్రోన్‌ను ఉపయోగిస్తున్నారు. బహిరంగ సభలు, భారీ జన సమీకరణ ఉండే సభల్లో రక్షణ పర్యవేక్షణకు వినియోగిస్తున్నారు. రోడ్డుపై ట్రాఫిక్ పర్యవేక్షణకు, తుపానులు, వరదల సమయంలో రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో ఈ డ్రోన్ సేవలను ఉపయోగించుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ (Cyber security) ముప్పు ఎదుర్కొనేలా సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయడం, పగలు రాత్రిళ్లు పనిచేసేలా కెమెరా సెన్సర్లు ఉండడం, సెల్యులార్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఇందులో ప్రత్యేకం. ఈ తరహా డ్రోన్లు ఒక ప్రాంతం నుంచి రిమోట్‌తో ఆపరేట్ చేయొచ్చు. ఇవి 12-24 గంటల పాటు ఏకధాటిగా గాలిలో ఎగరగలదు. నేల పైన, కొండ ప్రాంతాల్లో అయితే ఒక వాహనంపై నుంచి, నీటిలో ఓడపై నుంచి వీటిని దీన్ని నిర్వహించడానికి వెసులుబాటు కలదు.
హైడ్రోజన్ ఎలక్ట్రిక్ పవర్డ్ వీటీఓఎల్ ఎయిర్‌క్రాఫ్ట్ : హెలికాప్టర్‌లా కనిపించే ఈ తరహా డ్రోన్లు ప్రస్తుతం సరకు రవాణాలో వినియోగిస్తారు. ఇవి 100 కిలోల బరువున్న సరకును సుమారు 300 కిలో మీటర్లు మేర తీసుకెళ్తుంది. ఇందుకు ఎలాంటి రన్‌వే అవసరం లేదు. ఉన్న చోటు నుంచి నేరుగా పైకి లేచి వెళ్తుంది. ఈ తరహా డ్రోన్‌కు పైలట్ కూడా అనవసరం. దీనికి గమ్యస్థానాన్ని నిర్ణయిస్తే అక్కడికి నేరుగా సరకును చేరుస్తుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు 45 నిమిషాలు, ముంబాయి నుంచి పుణెకి 30 నిమిషాల్లో చేరుకుంటుంది. ప్రస్తుతం మనుఘలు ప్రయాణించేందుకు ఎయిర్ టాక్సీలను అనుమతుల్లేని కారణంలో వీటిలో సరకులను రవాణా చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. 2025 నాటికి మానవ రహిత డ్రోన్లలో టన్ను పేలోడ్‌తో 800 కిలో మీటర్లు సామర్థ్యంతో ఉండే వాటిని అందుబాటులోకి తెస్తామని తయారీదారులు వివరించారు.
ఓర్వకల్లులో డ్రోన్ హబ్ - మరి అక్కడే ఎందుకంటే?
వజ్ర డ్రోన్ వినియోగం : బహుళ రంగాల్లో ఏరో 360కి చెందిన వజ్ర డ్రోన్ అత్యధికంగా 1.15 గంటల (75 నిమిషాలు) పాటు గాల్లో ఉండగలదు. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో 10 కిలో మీటర్లు వరకు ప్రయాణిస్తుంది. పంట పర్యవేక్షణ, అటవీ పర్యవేక్షణ, వన్యప్రాణ సంరక్షణ, ఖనిజ అన్వేషణ, ఏరియల్ సర్వే, ఏరియల్ పెట్రోలింగ్, పైప్‌లైన్ పర్యవేక్షణ, ట్రాఫిక్ మేనేజిమెంట్, సెర్చ్-రెస్క్యూ, సరిహద్దు భద్రత లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటి కోసం థర్మల్ కెమెరా లాంటి ఆధునాతన సాంకేతికత పరికరాలను వాడుతున్నారు. అత్యంత నాణ్యతతో మ్యాపింగ్ చేయడం ఈ డ్రోన్లు ప్రత్యేకత.
వైద్య రంగం : ఈ డ్రోన్‌ను రెడ్‌వింగ్ అనే కంపెనీ పేరుతోనే ప్రమోట్ చేస్తున్నారు. దీన్ని మందులు, ఇతర హస్పిటల్ అవసరాల కోసం వినియోగించాలా రూపొందించారు. రక్త నమూనాలు (Blood Samples), మందులు, టీకాలను తీసుకు వెళ్లేందుకు ఉపయోగిస్తున్నారు. 3 కేజీల బరువును 50 కిలో మీటర్లు మేర తీసుకెళ్లగలదు. ఈ డ్రోన్‌లో మందులను భద్రపరిచేందుకు కోల్డ్ స్టోరేజీ కూడా ఏర్పాటు చేశారు. ‘యాలి ఏరోస్పేస్’ (Yali Aerospace) అనే సంస్థ కూడా వీటిని ప్రమోట్ చేస్తోంది.
అత్యవసర మందులను ఏజెన్సీ ప్రాంతాలకూ (Agency Areas) ఈ డ్రోన్‌లతో సరఫరా చేస్తున్నారు. ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్లు, స్మార్ట్ మెడిసిన్ బాక్స్, క్లౌడ్ వీడియోలను పర్యవేక్షించడం వంటి సదుపాయాలు ఈ డ్రోన్‌లో పొందుపరిచారు. ఈ డ్రోన్లను మొబైల్ యాప్ (Mobile App) ఆధారంగా రిమోట్‌తో ఆపరేట్ చేస్తున్నారు. ల్యాండింగ్, డెలివరీ తర్వాత అవే తిరిగి వస్తాయని నిర్వాహకులు తెలిపారు.
‘డ్రోన్ హబ్’ సంస్థ ( Drone Hub) అయితే మారుమూల ప్రాంతాలకు డ్రోన్‌తో సరఫరా చేసే మందులను అక్కడ కొద్దికాలం పాటు నిల్వ చేసేందుకు స్టోరేజీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్టోరేజీకి డ్రోన్‌ను లింక్ చేసి ఆయా ప్రాంతాలకు మందులను పంపుతారు. రెండు మూడు రకాల లోడ్లను పంపితే దేనికదే వేర్వేరుగా డెలివరీ చేసే డ్రోన్‌ను కూడా వీరు అభివృద్ధి చేశారు. వీటిని యూరప్ నుంచి తీసుకొచ్చారని నిర్వాహకులు వెల్లడించారు. ఇండియాలో అనుమతుల ప్రక్రియ పూర్తికావాల్సి ఉందని చెబుతున్నారు.
అమరావతి డ్రోన్ సమ్మిట్‌కి ముమ్మరంగా ఏర్పాట్లు
మ్యాపింగ్‌కి : ‘స్కైకాప్టర్ ఎ6’ (Skycopter A6) పేరుతో సెన్స్ ఇమేజెస్ టెక్నాలజీస్ సంస్థ తీసుకొచ్చిన ఈ డ్రోన్‌ను సర్వైలెన్స్, మ్యాపింగ్ కోసం వినియోగిస్తున్నారు. వీటిని వ్యవసాయం, వేస్ట్ మేనేజ్మెంట్, మైనింగ్, రియల్ ఎస్టేట్, సోలార్ ప్లాంట్లు వంటి వాటికీ వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్‌లో థర్మల్ కెమెరా, జూమ్ కెమెరా, ఆబ్లిక్ కెమెరా, లైడర్, మ్యాప్ 01 లాంటి వాటిని అవసరానికి తగినట్లుగా ఏర్పాటు చేస్తారు. ఈ రకం డ్రోన్‌లో మెగాఫోన్ కూడా అమర్చుతారు. భారీ బహిరంగ సభల సమయంలో ఏదైనా అలజడి జరిగితే ఈ డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తూ తొక్కిస లాటకు తావు లేకుండా ప్రజలు ఏ మార్గం నుంచి సురక్షితంగా బయటకు వెళ్లాలనే విషయాన్ని మెగాఫోన్ (Megaphone) ద్వారా ప్రకటించే వీలుంటుంది.
ప్రమాదాలను కనిపెట్టవచ్చు : గ్రామాల్లో ఆవాసాలు, రహదారులనూ మ్యాపింగ్ చేసేందుకు ఇటువంటి తరహా డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఏఐ ఆధారిత రూట్‌ప్లాన్‌తో (AI based routeplan) ఇది సెకనుకు 4 మీటర్ల వేగంతో, 8 కిలోమీటర్లు రేంజ్‌లో వెళ్లగలదు. ఈ డ్రోన్ 45 నిమిషాల పాటు గాల్లోనే ఉండగలదు. డ్యూయల్ కెమెరా, 22 వేల ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ఇందులో అమర్చారు. దీనికి అడ్వాన్స్‌డ్‌గా ‘స్కైహంటర్ విటాల్’ను (Skyhunter Vital) అందుబాటులోకి తెచ్చారు. ఇందులో యాంటీ కలర్ లైట్స్‌ను ఏర్పాటు చేశారు. ఇలాంటి డ్రోన్లు మల్టీ స్పెక్ట్రల్ కెమెరాలను అమర్చే అవకాశం ఉంది. సర్వేలకు, పారిశ్రామిక అవసరాలకు, లేజర్ స్కానింగ్ పెద్ద ఎత్తున స్థలాల మ్యాపింగుకు వినియోగిస్తారు. దీంతో పాటు ఏరియల్ గ్యాస్ పైప్‌లైన్ మానిటరింగ్ (Aerial Gas Pipeline Monitoring) కూడా చేస్తుంది. ఈ డ్రోన్ సహయంతో ఎక్కడైనా గ్యాస్ లీకైతే సులువుగా కనిపెట్టి, ప్రమాదాలను నివారించవచ్చు.
మంగళగిరిలో అమరావతి డ్రోన్ సమ్మిట్ - ఏపీని డ్రోన్స్ క్యాపిటల్‌గా మార్చాలని నిర్ణయం!
రక్షణ రంగం : ఈ రంగంలో అవసరాల కోసం ‘కామికాజీ డ్రోన్’ను (Kamikaze drone) వీయూ డైనమిక్స్ సంస్థ అభివృద్ధి చేసింది. రియల్ వరల్డ్ ఫ్లై స్టిములేషన్, అడ్వాన్స్‌డ్ ఎయిర్‌క్రాఫ్ట్ డైనమిక్స్ మోడలింగ్ వంటి ప్రధాన ఫీచర్లను వినియోగించి కంట్రోల్ రూం నుంచి ఈ డ్రోన్‌ను పర్యవేక్షిస్తారు. కంట్రోల్ రూంలో ఇంటర్‌ఫేస్ మాన్యువల్ కంట్రోల్, గాలుల తీవ్రతను గుర్తించే ప్యానల్, మూడు ఎల్‌ఈడీలతో (LED) కూడిన స్క్రీన్ ఉంటుంది. డ్రోన్‌తో తీసే విజువల్స్‌తో పాటు ఓపెన్ స్ట్రీట్మ్యాప్, హైబ్రిడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తారు. 150 కిలోమీటర్లు రేంజ్‌లో ఈ డ్రోన్ పయనించగలదు.
వ్యవసాయ రంగం : ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు, ప్రొఫెసర్లు కలిసి ఓ డ్రోన్‌ను తయారు చేశారు. క్రిమి సంహారక మందుల పిచికారీతో పాటు విత్తనాలు వెదజల్లడం దీని ప్రత్యేకత. ఈ డ్రోన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బా సహయంతో విత్తనాలను నింపి జల్లవచ్చు. దీంతో రైతులకు విత్తన బస్తాలు మోసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇందులో ఉండే కంటెయినర్ 10 కిలోల బరువు మోస్తుంది. 2 కిలోమీటర్లు వరకు ప్రయాణిస్తుంది. ఈ డ్రోన్ సుమారు 165 అడుగుల ఎత్తు ఎగురుతుంది. ఎకరా భూమికి సరిపడా విత్తనాల్ని 8 నిమిషాలు లోపే జల్లుతుంది.
డ్రోన్లతో ఫుట్‌బాల్ ఆడొచ్చు! : ఫుట్‌బాల్ ఆడే బుల్లి సమ్మిట్‌లో ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. దీని సాంకేతికతను కొరియాకు చెందిన సంస్థ అభివృద్ధి చేసింది. కొరియాలో వీటి కోసం ప్రత్యేక స్టేడియాలూ కూడా తీర్చిదిద్దారు. క్రీడాకారులు రిమోట్లు పట్టుకొని కోర్టు బయట ఉంటే వారి డ్రోన్లు లక్ష్యాన్ని గోల్ పోస్టులోకి నెడుతూ వెళ్తుంటాయి. అధునాతన సెన్సర్లు, అల్గారిథమ్‌లతో కూడిన ఈ డ్రోన్లు ఫీల్డ్‌ను నావిగేట్ చేస్తాయి.
సరికొత్త డ్రోన్లు ఆవిష్కరించిన 'విజయవాడ' విద్యార్థులు - అమరావతి డ్రోన్ సమ్మిట్‌కు సిద్ధం
అత్యవసర సమయాల్లో నేస్తం! : విపత్తుల సమయాల్లో డ్రోన్ సాయం అందిస్తోంది. మానవుడు సైతం వెళ్లలేని ప్రాంతాలకూ సరకులు, మందులు తీసుకెళ్లుతుంది. విజయవాడ వరదల్లో అది చేసిన సాయం చూశాం కదా. అలాంటి డ్రోన్‌ను సమ్మిట్‌ను ఇప్పుడు అక్కడే ప్రదర్శించారు. చేరవేయాల్సిన వస్తువును దానికి కట్టి లక్ష్యం చేరుకోగానే భద్రంగా అక్కడ జార విడుస్తుంది.