Alliance Leaders State Wide Election Campaign in AP : రాష్ట్రంలో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారంతో ప్రజలను కలుస్తున్నారు. కూటమి అభ్యర్థులు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
'వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వం కోల్పోయింది - అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలి'
అనంతపురం జిల్లా ఉరవకొండ కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ వజ్రకరూరు మండలంలో ప్రచారం చేశారు. వివిధ గ్రామాల్లో తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయమంటూ ఓటర్లను అభ్యర్థించారు. సంక్షేమం పేరిట వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమంతోపాటు అభివృద్ధి చేస్తామని పయ్యావుల కేశవ్ హామీ ఇచ్చారు.
కర్నూలు జిల్లా ఆదోని కూటమి అభ్యర్థి పార్థసారథి పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. తర్వాత వార్డుల్లో పర్యటించారు. వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి వాల్మీకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓట్లకు విజ్ఞప్తి చేశారు.
Election Campaign in AP : కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డలో కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ప్రచారం చేశారు. కూటమి విజయంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మండలి బుద్ధప్రసాద్ ప్రజలకు వివరించారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు వివరించారు. కరపత్రాలు పంచుతూ గాజుగ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ లంక గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు.
ఊరువాడా జోరుగా ఎన్డీఏ నేతల ఎన్నికల ప్రచారం
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణను గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి కృష్ణతులసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలతో కలిసి 20వ వార్డులో పర్యటించారు. కరపత్రాలు పంచుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు మహిళలకు వివరించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏ ఒక్క కుటుంబం సంతోషంగా లేదని కృష్ణతులసి అన్నారు.
Andhra Pradesh Elections 2024 : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కూటమి అభ్యర్థి కూన రవికుమార్ సతీమణి ప్రమీల పట్టణంలోని అనేక కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు వివరించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రమీలకు మహిళల నుంచి పెద్ద సంఖ్యలో మద్దతు లభించింది.
అలాగే బాపట్ల జిల్లాలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు ప్రాంతాలకు చెందిన వైఎస్సార్పీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పర్చూరు మండలం నాగులపాలెం మాజీ జడ్పీటీసీ సభ్యుడు కొల్లా సుభాష్ బాబు వైసీపీను వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పర్చూరు కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిన నందిగామ నుంచీ టీడీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ధనేకుల సాంబశివరావుతో పాటు కొంత మంది నాయకులు, 40 కుటుంబాలు వైసీపీను వీడాయి.
ఫ్యాన్ వేడిగాలి తట్టుకోలేక- దూసుకుపోతున్న సైకిల్ ఎక్కి సేదతీరుతోన్న వైసీపీ నేతలు