All set for Reopening of Anna Canteens: బుక్కెడు బువ్వ దొరక్క ఆకలితో అలమటిస్తున్న పేదలకు మూడుపూటలా కడుపునింపేందుకు 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు విశేష ఆదరణ పొందాయి. కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం, ఫలహారాలు అందించారు. అన్నదానం అంటే ఏదో రోడ్డుపక్కన పెట్టి మమ అనిపించేలా కాకుండా శుచికి, శుభ్రతకు మారుపేరుగా ప్రత్యేక భవనం నిర్మించి అన్నప్రసాదం అందించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే వీటిని నిలిపివేయడమేగాక అన్న క్యాంటీన్ భవనాలను పాడుబెట్టింది. కొన్నింటిని వార్డు సచివాలయాలుగా మార్చేసింది.
అన్నక్యాంటీన్లపై జగన్ కక్ష: ప్రతిరోజూ రెండున్నర లక్షల మంది పేదల కడుపు నింపిన క్యాంటీన్లను జగన్ కక్షగట్టి మూసివేశారు. కొన్నిచోట్ల తెలుగుదేశం నేతలే సొంత నిధులతో అన్నక్యాంటీన్లను కొనసాగించగా మరికొన్నిచోట్ల ప్రవాసాంధ్రులు, దాతలు సహకారం అందించారు. అధికార పార్టీ నేతల అడ్డంకులు, అధికారుల వేధింపులను తట్టుకుని వీటిని నిర్విరామంగా కొనసాగించారు. మళ్లీ అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తామని టీడీపీ, కూటమి నేతలు హామీ ఇచ్చారు. అందులో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడతలో వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నారు.
కూలీలకు ఉపయోగకరంగా అన్నక్యాంటీన్లు: కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల్లో క్యాంటీన్లు ప్రారంభించి పేదలకు 5 రూపాయలకే భోజనం అందించనున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కేవలం 5 రూపాయలకే అందించనున్నారు. క్యాంటీన్ ఆవరణలోనూ ఫ్యాన్లు, టీవీ, శుద్ధి చేసిన నీరు అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో పనుల కోసం పల్లెల నుంచి వచ్చే కూలీలకు అన్నక్యాంటీన్లు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి.
అక్షయపాత్రకే కాంట్రాక్టు: ఆటోడ్రైవర్లు, అడ్డా కూలీలు, భవన నిర్మాణ కార్మికులు మూడుపూటలా కడుపునింపుకునేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్షగట్టి క్యాంటీన్లు తొలగించిన తర్వాత వీరంతా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్లీ క్యాంటీన్లు ప్రారంభిస్తుండటంతో వారంతా సంబరపడుతున్నారు. అన్న క్యాంటీన్‌లకు ఆహార పంపిణీ కాంట్రాక్టు గతంలో మాదిరిగానే అక్షయపాత్ర దక్కించుకోవడంతో అదే శుచి, రుచి ఉండే అవకాశం ఉంది. అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలనుకునేవారు గుంటూరు చంద్రమౌళి నగర్‌లోని ఎస్బీఐ అకౌంట్ నెంబర్ 37818165097కి విరాళాలు పంపాలని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
'హర్ ఘర్ తిరంగా'లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయజెండా ఎగరాలి : సీఎం చంద్రబాబు - CBN on Har Ghar Tiranga