ADB Approves Funding for Amaravati: అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. రాజధాని అమరావతి నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. అమరావతికి 8వేల కోట్ల నిధులిచ్చేందుకు ఏడీబీ బోర్డు సమావేశంలో ఆమోదముద్ర పడింది. ఇక ప్రపంచ బ్యాంక్ ఆమోదం లాంఛనం కానుంది. ఈమేరకు తొలివిడతగా జనవరిలో 3 వేల 750 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అందనుంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసిన ప్రభుత్వం, నిధులు అందగానే పనులను పరుగులు పెట్టించేందుకు సర్వం సిద్ధం చేసింది.
రాజధాని అమరావతికి పట్టిన వైఎస్సార్సీపీ గ్రహణం వీడిన తర్వాత సమస్యలన్నింటినీ పరిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వం, చకచకా నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో 15 వేల కోట్ల నిధులు సాధించింది. కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB), ప్రపంచ బ్యాంకు కలిపి అమరావతికి 15 వేల కోట్ల నిధులు ఇవ్వనున్నాయి. ఈ మేరకు 8 వేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఏడీబీ బోర్డు సమావేశంలో ఆమోదముద్ర పడింది. ఈనెల 19న జరిగే సమావేశంలో ప్రపంచ బ్యాంకు కూడా పచ్చజెండా ఊపనుంది. ఇదంతా పూర్తికాగానే నూతన సంవత్సరంలో తొలివిడత కింద 25 శాతం నిధులు రాష్ట్రానికి అందనున్నాయి. అంటే 3 వేల 750 కోట్లు నిధులు అందుబాటులోకి వస్తాయని సీఆర్‌డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు.
అమరావతిలో 20 పనులకు ఆమోదం - రూ.11,467 కోట్ల వ్యయం
సుదీర్ఘ కసరత్తు తర్వాత నిధుల విడుదల: 'సమ్మిళిత, స్థిరమైన రాజధాని అభివృద్ధి' పేరుతో అమరావతికి ఏడీబీ రుణం మంజూరు చేస్తోంది. గత బడ్జెట్‌లో ఈ రుణ మంజూరుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపగానే, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ చర్చలు జరిపాయి. కేంద్ర ఆర్థికశాఖ, సీఆర్‌డీఏ సుదీర్ఘ కసరత్తు తర్వాత నిధుల విడుదలకు సమ్మతి లభించింది. గత వైఎస్సార్సీపీ పాలకుల నిర్లక్ష్యంతో రాజధాని ప్రాంతంలో పెరిగిన కంపచెట్లను, జంగిల్ క్లియరెన్స్ పేరుతో ప్రభుత్వం ఇప్పటికే శుభ్రం చేయించింది.
అలాగే 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భారీ భవంతుల నిర్మాణ పటిష్టతపై నిపుణులతో క్షేత్ర పరిశీలన చేయించింది. ఆ నిర్మాణాలకు ఎలాంటి ఢోకా లేదని నిపుణులు స్పష్టం చేయడంతో, మిగిలిన పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏడీబీ, ప్రపంచ బ్యాంకు నిధులకు తోడు హడ్కో రుణం కూడా రాజధానికి అందనుంది. ఈ నిధులతో వచ్చే మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులను కొలిక్కి తేవాలని ప్రభుత్వం సంకల్పం పెట్టుకుంది.
ఇక జెట్ స్పీడ్లో అమరావతి పనులు - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్లు