Young Man Ran 77 kilometers in Hyderabad Roads : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో ఓ యువకుడు రన్ ఫర్ ది నేషన్ పేరిట 77 కిలోమీటర్లు పరుగు తీశారు. స్వాతంత్ర్య సమరయోధులు, సైనికులకు హృదయపూర్వక నివాళి అర్పించడంతో పాటు వారి త్యాగాలను స్మరించుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 2018లో కూడా రైతుల కోసం హైదరాబాద్ నుంచి అమరావతి వరకు పరుగు కార్యక్రమం చేపట్టి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ప్రశంసలు అందుకున్నారు.
సమస్యలపై తన వంతు బాధ్యతగా : ఏపీలోని కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం పికట్ల గ్రామానికి చెందిన ఫణీంద్రకుమార్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సమాజంలోని సమస్యలపై తన వంతు బాధ్యతగా ఒక్కోసారి ఒక్కో సమస్యపై పరుగు చేపట్టి దాని పరిష్కారం కోసం ఆరాటపడుతూ ఉంటాడు. తాను చేపట్టిన కార్యక్రమం వల్ల ఒక్కరికి లబ్ధి చేకూరినా తనకు సంతోషమే అనేది ఫణీంద్ర ఆలోచన. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు వివిధ సమస్యలపై అనేక సార్లు 2000 కిలోమీటర్లుకు పైగా పరుగు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు పూర్తైన సందర్భంగా హైదరాబాద్‌లో 77 కిలోమీటర్లు పరుగు కార్యక్రమాన్ని చేపట్టాడు. బుధవారం సాయంత్రం 4 గంటలకు నెక్లెస్ రోడ్ నుంచి మొదలైన పరుగు నగరంలోని వివిధ ప్రాంతాలను చుట్టేసి గురువారం ఉదయం అదే నెక్లెస్ రోడ్‌లో ముగిసింది.
చంద్రబాబు నుంచి ప్రశంసలు : గృహ హింస కారణంగా ఫణీంద్రకు తన సోదరి దూరమయ్యారు. దాంతో వరకట్న వేధింపులు, గృహహింసకు వ్యతిరేకంగా, అలాగే స్త్రీలు, అమ్మాయిల పట్ల పురుషులు వ్యహరించలవలసిన తీరుపట్ల అవగాహన కల్పించేలా గతంలో పరుగును నిర్వహించారు. ఈ పరుగులో అప్పట్లో చాలా మంది భాగస్వాములయ్యారని ఫణీంద్ర తెలిపారు. అలాగే అన్నం పెట్టే రైతన్నలకు కనీస మద్ధతు ధరతో పాటు వారి సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ నుంచి అమరావతి వరకు 2018లో 325 కిలోమీటర్ల పరుగును పూర్తిచేశారు. ఇందుకోసం 5 రోజుల సమయం పట్టింది. ఈ నేపథ్యంలో అప్పడు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడ్ని కలిసిన ఫణీంద్ర.. బాబు మన్ననలు పొందారు. తాజాగా ఇప్పుడు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో 77 కిలోమీటర్లు పరిగెత్తి అందరం ఐకమత్యంగా ఉండాలంటూ చాటిచెబుతున్నారు.
'రన్ ఫర్ ది నేషన్' అంటే రన్నింగ్ మాత్రమే కాదు. పరుగు ద్వారా అందర్నీ కలుస్తూ చైతన్య పరచడం. స్వాతంత్ర్య సమరయోధులు,సైనికులకు హృదయపూర్వక నివాళి అర్పించడంతో పాటు వారి త్యాగాలను స్మరించుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.సమాజంలోని సమస్యలపై నా వంతు పోరాటం చేస్తున్న. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు యువత ముందుకు రావాలి. 2018లో హైదరాబాద్ నుంచి అమరావతికి 325 కిలోమీటర్లు పరుగును పూర్తిచేశాను. దీంతో అప్పడు సీఎంగా ఉన్న చంద్రబాబు అభినందించారు. ప్రస్తుతం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో 77 కిలోమీటర్లు పరిగెత్తి, అందరం ఐకమత్యంగా ఉండాలంటూ చాటిచెబుతున్నా." - ఫణీంద్ర కుమార్, రన్నర్
స్నేహితునికి మద్దతుగా : ఫణీంద్ర చేపట్టిన రన్ ఫర్ ది నేషన్ కార్యక్రమానికి అతని స్నేహితులు మద్దతుగా నిలిచారు. పరుగు మధ్యలో ఆపి కాస్త విశ్రాంతి తీసుకునే సమయంలో అన్నీ వారే చూసుకున్నారు. తమ స్నేహితుడు చేపట్టిన 'రన్ ఫర్ ది నేషన్' కార్యక్రమంలో తమ పాత్ర కొంత ఉన్నందుకు ఆనందంగా ఉందటున్నారు.
పట్టుదల, కృషి - అద్భుతాలు సృష్టిస్తున్న వారిజ నేత్ర విద్యాలయ విద్యార్థులు - VARIJA NETRA VIDYALAYA