A Young Man from Vijayawada has won Various Medals in Yoga : రెండేళ్ల క్రితం నుంచి యోగాలో శిక్షణ తీసుకుంటూ పతకాలు కొల్లగొడుతున్నాడు బెజవాడకు చెందిన షాలెమ్ రాజ్. రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. నిత్యం ఆరోగ్యంతోపాటు దృఢంగా ఎదగడానికి యోగాను ఎంచుకుని స్పోర్ట్స్ కోటాలో మంచి ఉద్యోగం సాధించాలని నిరంతరం సాధన చేస్తున్నాడు.
క్రమం తప్పకుండా యోగాపై పట్టు : యోగాలో వివిధ విన్యాసాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు షాలెమ్ రాజ్రు షాలెమ్ రాజ్. పల్నాడు జిల్లాకు చెందిన వీరి కుటుంబం పిల్లల చదువుల కోసం విజయవాడలో స్థిరపడింది. షాలెమ్ తండ్రి ఆటో నడుపుతూ ముగ్గురు పిల్లల్ని చదివిస్తున్నారు. డిగ్రీ చదువుతున్న షాలెమ్ రాజ్ అతని ఇద్దరు అక్కలు యోగాలో శిక్షణ తీసుకోవడం చూసి ఆసక్తి పెంచుకున్నాడు. విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో అమరావతి యోగా, ఏరోబిక్స్ సంఘం పర్యవేక్షణలో రెండేళ్ల క్రితం యోగాలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించాడు. యోగాచార్యులు సత్యనారాయణ దగ్గర ఓనమాలు నేర్చుకుని క్రమం తప్పకుండా యోగాపై పట్టు సాధించాడు. యోగాలో తనకంటూ ప్రత్యేకగుర్తింపు ఉండాలనే తలంపుతో కఠినమైన ఆసనాలు అలవోకగా వేసి ఆకట్టుకుంటున్నాడు.
'ఈ స్థాయిలో ఉండడానికి హార్డ్‌వర్క్, తల్లిదండ్రులే కారణం - ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యం'
బంగారు, కాంస్య, రజత పతకాలు సొంతం : షాలెమ్ రాజ్ ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ పోటీల్లో పాల్గొని బంగారు, కాంస్య, రజత పతకాలు సాధించాడు. ఇటీవల కర్నూలులో నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. 18 నుంచి 21 ఏళ్ల కేటగిరిలో ట్రెడిషనల్, ఆర్టిస్టిక్ విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచి రెండు పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు. ఈ ప్రతిభ ఆధారంగా మైసూర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. డిసెంబర్‌లో సింగపూర్‌లో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొననున్నాడు.
చలాకీగా ఉంటూ పట్టుదలతో సాధన : షాలెమ్ రాజ్ శిక్షణ తీసుకుంటూనే మరో పది మందికి యోగాలో తర్ఫీదు ఇస్తున్నాడు. అతని దగ్గర శిక్షణ తీసుకున్నవారు రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి పతకాలు సాధిస్తున్నారు. షాలెమ్ రాజ్ చాలా చలాకీగా ఉంటాడని, పట్టుదలతో సాధన చేస్తున్నాడని యోగాచార్యులు సత్యనారాయణ చెబుతున్నారు. తక్కువ కాలంలో యోగాలో మంచి నైపుణ్యం సాధించాడని వివరించారు.
రెండు కాళ్లు లేకుంటేనేం! - స్విమ్మింగ్ పోటీల్లో బంగారు పతకాలు