A wife Brutally Assaulted by Husband at Medchal District : నేటి కాలంలో సాంకేతికతో పాటు మనుషులూ మారిపోతున్నారు. ఒకప్పుడు మానవ సంబంధాలకు పెద్దపీట వేసేవారు. కానీ నేడు ఆస్తిపాస్తులు, డబ్బుకు విలువ ఇస్తున్నారు. ఇందుకోసం ఎంతటి దారుణానికైనా వెనకాడటం లేదు. ఎంతలా అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, రక్త సంబంధీకులనైనా కడతేర్చడానికైనా సిద్ధపడుతున్నారు. తాజాగా మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఓ ఘటన తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చోటుచేసుకుంది.
Medchal Husband and Wife Issue : వివరాల్లోకి వెళితే, ఘట్‌కేసర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఓ మహిళ తన భర్తను ఇనుప గొలుసుతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చివరికి ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆయనకు విముక్తి లభించింది. ఇందుకు సంబంధించి ఘట్‌కేసర్ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం, ఘట్‌కేసర్‌లోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన సెంట్రింగ్ గుత్తేదారు పత్తి నరసింహ (50), భార్య భారతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. భార్య పేరిట ఉన్న స్థలంలో నరసింహ ఇంటి నిర్మాణం చేపట్టారు.
ఇందుకోసం చేసిన అప్పులు తీర్చేందుకు నరసింహ తన పేరు మీద ఉన్న మరో స్థలం అమ్ముతానని భార్యకు చెప్పాడు. అప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సంవత్సరం క్రితం ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతని ఆచూకీ లభించలేదు. గత నెల 30న నరసింహ యాదాద్రి భువనగిరి జిల్లా పడమటి సోమారంలో ఉన్నట్లు భారతమ్మ తెలుసుకుంది. కుమారులతో కలిసి వెళ్లి భర్తను ఇంటికి తీసుకొచ్చింది. అనంతరం నరసింహను గదిలో వేసి ఇనుప గొలుసులతో కట్టేసి తాళం వేసింది.
నలుగురి ఉసురు తీసిన గొలుసుకట్టు వ్యవహారం - ప్రధాన నిందితుడు అరెస్ట్ - Tangutur Suicide Case Updates
మూడు రోజులుగా ఇంటి స్థలం తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని అతడిని చిత్రహింసలు పెట్టింది. ఈ దృశ్యాన్ని స్థానికులు రహస్యంగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి మాజీ ఎంపీటీసీ సభ్యుడు మహేశ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బంధీగా ఉన్న నరసింహను విడిపించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భార్య భారతమ్మ, కుమారుడు గణేశ్, రాజులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదులు పేర్కొన్నారు. మరోవైపు పోలీసులను చూసి నరసింహ బోరున విలపించాడు. గొలుసులతో కట్టేసి మూడ్రోజులుగా చిత్రహింసలు పెట్టారని, మీరే కాపాడాలంటూ వారిని వేడుకున్నాడు.