Stock Trading Cyber Crime In Hyderabad : స్టాక్ ట్రేడింగ్‌లో అనుభవం ఉన్న ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి రూ. 3కోట్ల 30 లక్షలు పోగొట్టుకున్నాడు. వాట్సాప్‌లో నేరగాళ్లు పంపిన సందేశాలను నమ్మి నెల రోజుల వ్యవధిలో ఇంత మొత్తం బదిలీ చేశాడు. కనీసం ఒక్క ఫోన్ కాల్ మాట్లాడకుండా నేరగాళ్లు ఈ సొమ్మంతా కొట్టేశారు. దీనిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌సీఎస్‌బీ) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్వాల్‌కు చెందిన ఓ వ్యక్తి గత కొన్నేళ్లుగా స్టాక్ ట్రేడింగ్ చేస్తున్నాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, ఇతర అంశాలపై అతనికి మంచి అనుభవముంది.
Cyber Crime In Hyderabad : ఈయనకు నెల రోజుల క్రితం వాట్సాప్‌కు ఓ యువతి పేరిట సందేశం వచ్చింది. స్టాక్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఇప్పటికే ఎంతో మంది సంపాదించినట్లు యువతి చెప్పింది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో ఉన్న గ్రూపులో చేర్చింది. తమకు స్టాక్ ట్రేడింగ్ భారీగా లాభాలు వచ్చాయంటూ గ్రూపులోని కొందరు పోస్టు చేసేవారు. ఇదంతా నమ్మిన బాధితుడు యువతి చెప్పినట్లు యూఐసీఐసీఆర్ పేరుతో ఉండే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు.
సైబర్ కేటుగాళ్ల సరికొత్త పంథా : అందులో ఆయన పేరిట వర్చువల్ ఖాతా తెరిచి యువతి చెప్పినట్లు తొలిరోజే రూ. 30 లక్షల చొప్పున రెండు సార్లు రూ. 60 లక్షలు నేరగాళ్లు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశారు. రూ. 60 లక్షల పెట్టుబడికి రూ. 3 లక్షల లాభం వచ్చినట్లు యాప్‌లో చూపడంతో నిజమేనని నమ్మాడు. నేరగాళ్లు చెప్పినట్లుగా వింటూ పలు దఫాల్లో నెల రోజుల వ్యవధిలో రూ. 3 కోట్ల 30 లక్షలు వేర్వేరు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు.
రూ.3 కోట్ల 30 లక్షలు పెట్టుబడికి లాభంతో కలిపి రూ. 19 కోట్లు వచ్చినట్లు వర్చువల్ ఖాతాలో చూపించారు. ఈ మొత్తం విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా రూ. 1.70 కోట్ల పన్ను కట్టాలని అవతలి వ్యక్తులు మెలిక పెట్టారు. వెంటనే మోసమని గ్రహించిన అతను టీఎస్‌సీఎస్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.