Girl Abduction Case in Ongole : ఆ మహిళ భర్తకు దూరంగా ఉంటూ కుమార్తెతో వేరుగా జీవిస్తోంది. అప్పుడే ఆమెకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మాయమాటలతో దగ్గరయ్యాడు. తమకు చేదోడుగా వాదోడుగా ఉంటాడనుకుందో ఏమో తెలియదు కానీ సదరు మహిళ ఆ మాటలు నమ్మి అతడితో సహజీవనం చేస్తోంది. ఇక్కడే అతను తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఆమె కుమార్తెపై కన్నేశాడు. ప్రేమ పేరుతో ఆ మైనర్ బాలికను లోబర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ యువతిని లోబరుచుకొని అపహరించాడు. ఈ విషయం తెలియని ఆ తల్లి వారి కోసం వెతికింది. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇందుకు సంబంధించి పోలీసుల కథనం మేరకు ఒంగోలు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తన భర్తకు దూరంగా ఉంటోంది. పదో తరగతి చదువుతున్న కుమార్తెతో వేరుగా నివసిస్తోంది. టంగుటూరు మండలం పొందూరుకు చెందిన ఇండ్లా రాజు అనే వ్యక్తితో కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో మైనర్ బాలికను రోజూ పాఠశాలకు తీసుకెళ్లి తీసుకొస్తుండేవాడు. తల్లితో సహ జీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉన్న అతడు నైతికతను మరిచాడు.
A Man Abducted Stepdaughter : ప్రేమ పేరుతో రాజు ఆ మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పాడు. అది నిజమేనని ఆ బాలిక నమ్మింది. రెండు రోజుల క్రితం ఇద్దరూ పాఠశాలకంటూ ఇంటి నుంచి బయటికెళ్లారు. సాయంత్రమైనా తిరిగి రాలేదు. దీంతో బాలిక తల్లి ఒంగోలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు బాలికతో పాటు నిందితుడు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి ఒంగోలు తీసుకొచ్చారు. రాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ ఎం.శ్రీనివాసరావు పేర్కొన్నారు.