Father Cheated His Children In Karimnagar : క్షణికావేశంలో చేసిన తప్పులు కుటుంబాల్ని అతలాకుతలం చేస్తాయి. తప్పు చేసిన వారిని సన్మార్గంలో పెట్టడమే జైలు శిక్ష ముఖ్య ఉద్దేశం. తాను చేసిన తప్పులు తెలుసుకొని జైలులో సత్ప్రవర్తనతో మెదిలేవారికి జైలు శిక్ష కాలం కంటే ముందుగానే విడుదల చేస్తారు. అలా జైలు నుంచి విడుదలైన ఓ వ్యక్తి తను మారినట్టే పిల్లల ముందు నటించాడు. ఎంత కాలం నటిస్తాననుకున్నాడో ఏమో తొందరగానే తన బుద్ధిని బయటపెట్టాడు. ఇంతకీ అతడేం చేశాడు ఈ కథనంలో తెలుసుకుందాం?
పద్నాలుగేళ్లపాటు జైలు జీవితాన్ని గడిపి సత్ప్రవర్తన కలిగిన ఖైదీగా విడుదలైన వ్యక్తి వారం రోజుల్లోనే తనలో మార్పు రావడం అసాధ్యమని నిరూపించాడు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లికి చెందిన సోమసారయ్య అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం క్షణికావేశంలో తన భార్య సత్తమ్మను హత్య చేశాడు. ఆ సమయంలో కుమార్తె పూజ వయస్సు ఐదేళ్లు, కుమారుడు బన్నీకి మూడేళ్లు. భార్యను హత్య చేసిన కేసులో కుమార్తె సాక్ష్యంతో సోమసారయ్యను పోలీసులు అరెస్టు చేయగా అతడు 2010 నుంచి జీవిత ఖైదు అనుభవించాడు.
తల్లిని కోల్పోయిన చిన్నారుల కష్టాన్ని చూసి అప్పటి సీఐ సుందరగిరి శ్రీనివాస్‌రావు జమ్మికుంటలోని స్పందన స్వచ్ఛంద సేవా సంస్థ అనాథాశ్రమంలో చేర్పించారు. నిర్వాహకులు వీరస్వామి, శోభారాణి పిల్లల ఆలనా పాలనా చూశారు. భార్యను హత్య చేసిన సమయంలో కుమార్తె పూజ వయస్సు ఐదేళ్లు కాగా, కుమారుడు బన్నీకి మూడేళ్లు. ప్రస్తుతం పూజ డిగ్రీ, బన్నీ ఇంటర్ సంవత్సరం చదువుతున్నారు.
ఈ నెల 3వ తేదీన సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సారయ్య చంచల్‌గూడ జైలు నుంచి బయటికొచ్చాడు. జైలు నుంచి వచ్చిరాగానే అనాథాశ్రమంలో ఉన్న కుమార్తె, కుమారుడి దగ్గరకు వెళ్లాడు. పోషణ బాధ్యతలు తీసుకుంటానని ఆశ్రమంలో చెప్పి వారిని తీసుకెళ్లాడు. జమ్మికుంటలోనే ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఈ నెల 8న జైలు అధికారులు తనను రమ్మంటున్నారంటూ, మాయమాటలు చెప్పి హైదరాబాద్ వెళ్లిపోయాడు.
ఈనెల 9న పిల్లలకు ఫోన్ చేసి తాను హైదరాబాద్‌లోనే పని చూసుకున్నట్లు తెలిపాడు. మరో పెళ్లి చేసుకొని అక్కడే ఉంటానని చెప్పడంతో అక్కాతమ్ముడు హతాశులయ్యారు. ‘ఇకపై మీకు నాకు సంబంధం లేదు. ఆధార్, సర్టిఫికెట్లలోనూ తండ్రి పేరు తీసేయండి’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడని పిల్లలు వాపోయారు. పిల్లలిద్దరూ తీవ్ర ఆవేదనకులోనై ఎటు వెళ్లాలో తెలియక తిరిగి ఆశ్రమానికే వెళ్లిపోయారు.
అనాథలుగా పెరిగిన ఇద్దరికి సర్టిఫికెట్లలో సరైన పేరు రాయలేదనే ఉద్దేశంతో స్కాలర్షిప్ కూడా రావడం లేదని పూజ వాపోయింది. అనాథలుగా పెరిగిన తమకు తండ్రికి తోడుగా ఉంటాననేసరికి కొండంత ధైర్యం వచ్చిందని, కానీ ఇప్పుడు ఆయన ప్రవర్తనతో మరింత బాధ కలుగుతోందని కన్నీరుమున్నీరవుతున్నారు ఆ పిల్లలిద్దరు.