150 Year Old Cinema Tree is Re Sprouting Rajamahendravaram : ఎన్నో ప్రకృతి విపత్తులను తట్టుకొని, సుమారు 300 సినిమాల చిత్రీకరణకు వేదికైన 150 ఏళ్ల ఆ వృక్షం నేలకూలగానే తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లో ఉన్నవారు సైతం విలవిల్లాడిపోయారు. ప్రస్తుతం ఇది వివిధ చికిత్సల ఫలితంగా పునరుజ్జీవం పోసుకుంటోంది. కొవ్వూరు మండలం కుమారదేవంలోని ఈ సినిమా చెట్టు(నిద్రగన్నేరు) వేరు నుంచి రెండుగా చీలిపోయి ఆగస్టు 5న భారీ వర్షాలు, వరదలకు గోదావరిలో పడిపోయింది.
రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ స్పందించి చెట్టు పడిపోయిన ప్రాంతాన్ని సమగ్రంగా పరిశీలించి బతికించేందుకు చర్యలు చేపట్టింది. అదే నెల 8న వేర్లు, కొమ్మలు కత్తి రించే పనులు ప్రారంభించారు. ఆయా ప్రదేశాల్లో పలు రసాయన మిశ్రమాలను అద్దారు. అవి పూసిన చోట గాలి, దూళి తగలకుండా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం కాండం, కొమ్మల బాగాల్లో సుమారు పది చోట్ల పచ్చని ఆకులతో చిగుళ్లు వచ్చాయి. మరో నెల రోజుల్లో ఏపుగా పెరిగే పరిస్థితి ఉంది.
రోటరీ క్లబ్ గ్రీన్ భారత్, వనం-మనం విభాగం ద్వారా చెట్టు ప్రాజెక్టు చైర్మన్ రేఖపల్లి దుర్గాప్రసాద్ ప్రత్యేక పర్యవేక్షణలో రెండు నెలలుగా ఈ కార్యాచరణ నడుస్తోంది. చెట్టు గోదావరి గట్టును ఆనుకొని ఉండడం, ఆ ప్రదేశం కొద్దికొద్దిగా కోతకు గురవడం వరుసగా వర్షాలతో పనులకు తీవ్ర ఆటంకం కలిగింది. జేసీబీలతో పనిచేయడం ప్రహసనంగా మారింది. గత 10 రోజులుగా రెండు, మూడు సార్లు చిగుళ్లు వచ్చినా ఎలుకలు వాటిని తినేయడంతో ఇబ్బందులు తప్పలేదు. ముగ్గురు వ్యక్తులు నిత్యం పర్యవేక్షిస్తూ అవసరమైన రసాయనాలు అందిస్తూ శ్రద్ధ కనబరిచారు. మళ్లీ అక్టోబరు (ఒక ఏడాది) నాటికి కొమ్మలుగా విస్తరించి పదిమంది కూర్చొని సేదదీరే స్థాయికి వస్తుందని రోటరీ క్లబ్ ప్రతినిధులు చెబుతున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో రెండు నెలల క్రితం కూలిన సినిమా చెట్టు మళ్లీ బతికింది. 150 ఏళ్ల నాటి నిద్రగన్నేరు చెట్టు మళ్లీ చిగురుస్తోంది. ఇంతకీ ఆ చెట్టుకు మళ్లీ పునరుజ్జీవం పోసిందెవరు? అదెలా సాధ్యపడింది? పూర్వస్థితికి వస్తుందా? వస్తే ఎన్ని రోజులు పడుతుంది? ఆ వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు.
150 ఏళ్ల వయసు - 300 సినిమాలు - నేలకూలిన భారీ వృక్షం - Cinema tree Fallen down