Kohli Rohit T20 Retirement : భారత టీ20 క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. స్టార్ బ్యాటర్లు కోహ్లీ, రోహిత్ శర్మ ఆటకు వీడ్కోలు పలికారు. పొట్టి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ విజయం సాధించిన అనంతరం టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పారు. అయితే మరో టీ20 వరల్డ్ కప్‌కు రెండేళ్ల సమయమే మిగిలి ఉంది. మరి భారత జట్టు మేనేజ్‌మెంట్ విరాట్, హిట్ మ్యాన్ లేని లోటును వీలైనంత త్వరగా భర్తీ చేయగలదా? అలా చేస్తేనే ప్రపంచ కప్ టైటిల్ రేసులో భారత్ ముందుంటుంది. అయితే కోహ్లీ, రోహిత్ ప్లేస్‌లో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.
కేఎల్ రాహుల్ - కోహ్లీ, రోహిత్ టీ20ల నుంచి తప్పుకోవడంతో టాప్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్ ఒక్కడే సీనియర్. పంత్, సంజు శాంసన్ ఇద్దరు వికెట్ కీపర్‌లు ఉండటం వల్ల ఈ టీ20 వరల్డ్ కప్‌లో స్థానం దక్కలేదు. అయితే 72 అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం అతడికి ఉంది. కాబట్టి ఇప్పుడు కోహ్లీ, రోహిత్ బాధ్యతను రాహుల్ తీసుకుని ముందుకు నడవాల్సిన అవసరముంది.
శుభ్‌మన్ గిల్ - వన్డే రెగ్యులర్ ప్లేయర్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌కు టీ20లోనూ మంచి రికార్డ్ ఉంది. ఐపీఎల్ 2023లో 890 పరుగులతో టాప్‌లో నిలిచాడు. అయితే జాతీయ జట్టు తరఫున మాత్రం టీ20ల్లో పెద్దగా రాణించలేదు. ఇప్పటివరకు 14 టీ20లు ఆడాడు. కేవలం 335 పరుగులే ఖాతాలో వేసుకున్నాడు. కానీ అతడికి టీ20ల్లో మంచిగా రాణించే సత్తా ఉందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. త్వరలో జింబాబ్వేతో జరగబోయే టీ20 సిరీస్‌కు ఇతడినే కెప్టెన్‌గా నియమించారు.
యశస్వి జైస్వాల్ - ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేసి భారత టెస్టు క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం ఓపెనర్‌గా రాణించి టీ20లో చోటు దక్కించుకున్నాడు. 2024 టీ20 ప్రపంచ కప్ జట్టులోనూ స్థానం సంపాదించాడు. అయితే ఈ టోర్నీలో అతడికి ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే ఛాన్స్ రాలేదు. ఇప్పటివరకు ఇతడు 17 మ్యాచ్‌లు ఆడాడు. 161.93 స్ట్రెక్‌రేట్‌తో 502 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ఇతడికి మరింత ఎక్కువ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తే మరింత రాటుదేలుతాడని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
రుతురాజ్ గైక్వాడ్ - 2021లో అంతర్జాతీయ టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఓపెనర్‌గా ఆడే రుతురాజ్ ఇప్పటివరకు 19 టీ20లు ఆడాడు. 35.71 సగటుతో 500 పరుగులు చేశాడు. కానీ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. అయితే ఇప్పుడతడికి మరో అవకాశం దక్కింది. జింబాబ్వేతో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు.
Inexplicable emotions, realisation of a dream coming true and pure happiness all around 🇮🇳❤️
— BCCI (@BCCI) July 1, 2024
A montage of #TeamIndia's moment of Glory 🏆
WATCH 🎥🔽 #T20WorldCup | #SAvIND | #Finalhttps://t.co/G1TYFqkTqH
అభిషేక్ శర్మ - ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ తరఫున మెరుపు బ్యాటింగ్ చేసిన ఇతడు సెలక్టర్ల దృష్టినీ ఆకర్షించాడు. త్వరలో జింబాబ్వేతో జరిగే ఐదు టీ20ల సిరీస్‌కు సెలెక్ట్ అయ్యాడు. ఈ ఐపీఎల్ 2024లో అత్యధిక సిక్స్‌లు (42) బాది క్రికెట్ ప్రియులను ఆకర్షించాడు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్‌గాను ఉపయుక్తంగా ఉంటాడు. ఇతడికి మంచి ప్రోత్సాహం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తాడని అంతా అనుకుంటున్నారు.
ఇషాన్ కిషన్ - దూకుడుగా ఆడే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను సెలక్టర్లు ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు. అతడు సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి జట్టులోకి వస్తే టీమ్‌ఇండియాకు మరింత బలం చేకూరే అవకశాం ఉంది.
టీమ్ఇండియా రిటర్న్ జర్నీకి బ్రేక్- తుపాన్ దెబ్బకు ప్లేయర్లంతా హోటల్లోనే! - T20 World Cup 2024