Suryakumar Yadav IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. రోజు రోజుకూ కొత్త రికార్డులు పుట్టుకొస్తున్నాయి. అయితే దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున ఉన్నాయి. దిల్లీ నాలుగు మ్యాచ్‌లలో ఒక్కటి గెలవగా, ముంబయి ఆడిన మూడింట్లో ఆడింది. ఇకపై ఆడే మ్యాచ్‌లు ఈ రెండు టీమ్‌లకు చాలా కీలకం. ఈ క్రమంలో ఏప్రిల్ 7న ఈ రెండు టీమ్‌ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సమయంలో ముంబయిని ఓ గుడ్‌న్యూస్, దిల్లీని ఓ బ్యాడ్‌న్యూస్ పలకరించింది.
సూర్య వచ్చేశాడు
ముంబయి ఇండియన్స్‌కు శుభవార్త. స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ మళ్లీ గ్రౌండ్లో అడుగుపెట్టనున్నాడు. గాయం కారణంగా ఎన్సీఏలో కోలుకుంటున్న సూర్య పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఈ క్రమంలో ఎన్సీఏ నుంచి అతడు క్లియరెన్స్ కూడా పొందినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ స్టార్ ప్లేయర్ ముంబయి జట్టుతో కలిసి ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశాడు.
వాంఖడే స్టేడియంలో ట్రైనింగ్ సెషన్‌లో శుక్రవారం గంటకు పైగా సాధన చేశాడు. ఆదివారం దిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో సూర్య బరిలో దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో హ్యాట్రిక్ ఓటములతో ఇంకా పాయింట్ల ఖాతా తెరవని ముంబయికి ఇది కాస్త ఊరట లభించే విషయమే. ఇక సూర్య మెరుపులు చూసేందుకు ముంబయి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దిల్లీ నుంచి కుల్దీప్ ఔట్!
దిల్లీ క్యాపిటల్స్ జట్టుకి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దూరమయ్యాడు. మార్చి 28న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. టీమ్ మేనేజ్‌మెంట్ సలహా మేరకు ప్రస్తుతం విరామం తీసుకున్నాడు. ఇప్పటికి కుల్దీప్ రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలో కుల్దీప్ 3 వికెట్లు తీశాడు. కుల్దీప్ కోలుకోవడానికి, పూర్తి ఫిట్‌నెస్‌కి తిరిగి రావడానికి కొంత సమయం పడుతుందని భావిస్తున్నారు.
భారత ఆటగాళ్లకు సంబంధించి గాయాలైతే ఫ్రాంచైజీలు NCAకి నివేదించాలి. కుల్దీప్ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ కావడం, త్వరలో టీ20 వరల్డ్ కప్ ఉండటంతో, నేషనల్ క్రికెట్ అకాడమీ స్పోర్ట్స్ సైన్స్, మెడికల్ టీమ్ నిర్ణయం కీలకం కానుంది. ఆదివారం ముంబయితో జరిగే కీలక మ్యాచ్‌లో కుల్దీప్ ఆడటంపై స్పష్టత లేదు. ఈ సీనియర్ స్పిన్నర్ దూరమవడంతో దిల్లీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
పంత్‌కు డబుల్ షాక్ - దిల్లీ క్యాపిటల్స్ జట్టు మొత్తానికి కూడా - IPL 2024 KKR VS DC