Rishabh Pant Fake Injury : టీమ్ఇండియా 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచి చాలా రోజులైంది. విజయోత్సవ ర్యాలీ, సంబరాలు అన్నీ పూర్తయిపోయాయి. కానీ దక్షిణాఫ్రికాతో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతున్న సమయంలో భారత ఆటగాళ్లు, అభిమానులు అనుభవించిన నరాలు తెగే ఉత్కంఠ గురించి మాత్రం ఇప్పటికీ చర్చించుకుంటూ ఉంటారు. దాదాపు టీ20 కప్పు చేజారిపోయిందనుకొన్న తరుణంలో భారత్ అద్భుతంగా పుంజుకొంది. కోట్ల మంది కలలను నిజం చేస్తూ కప్పును చేజిక్కించుకొంది.
ఈ విజయానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో పంత్ చేసిన తెలివైన పని కూడా ఓకటని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. తాజాగా ఈ ఆసక్తికర ఘటన గురించి రోహిత్ 'ది కపిల్ శర్మ షో'లో మాట్లాడాడు. దీనిపై టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా స్పందించాడు. ఇంతకీ ఫైనల్ మ్యాచ్‌లో పంత్ ఏం చేశాడో? తెలుసా?
దక్షిణాఫ్రికా జోరును ఆపిన పంత్?
షోలో కెప్టెన్ రోహిత్ శర్మ షేర్ చేసుకొన్న స్టోరీ ప్రకారం, 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చివరి నిమిషాల్లో దక్షిణాఫ్రికా కప్పు గెలవనుందని చాలా మంది భావించారు. దక్షిణాఫ్రికాకి ఓ సమయంలో 30 బంతుల్లో 30 పరుగులు అవసరం. క్రీజులో హెన్రిచ్ క్లాసెస్, మిల్లర్ ఊపు మీద ఉన్నారు. ఆ సమయంలో వికెట్ కీపర్ పంత్ దక్షిణాఫ్రికా లయను దెబ్బతీయాలని భావించాడు. మోకాలిలో నొప్పి కలుగుతున్నట్లు కింద పడిపోయాడు. వెంటనే టీమ్ ఫిజియో మైదానంలోకి వచ్చాడు. మ్యాచ్ కొన్ని నిమిషాలపాటు ఆగాల్సి వచ్చింది.
ఆట వేగంగా సాగుతున్న సమయంలో బ్యాటర్లు వీలైనంత త్వరగా బౌలర్ బంతులు వేయాలని కోరుకొంటాడని రోహిత్ పేర్కొన్నాడు. ఆ సమయంలో లయను దెబ్బతీయడం కీలకమని తెలిపాడు. ఆ తర్వాత వికెట్ల వెనకాల పంత్ నేలమీద పడి ఉండటం చూశానని, ఫిజియో వచ్చి అతడిని టెస్ట్ చేస్తున్నాడని చెప్పాడు. ఏదేమైనా పంత్ చేసిన పని భారత్‌కి కొంత సమయం ఇచ్చిందని కెప్టెన్ వివరించాడు.
పంత్ ఏమన్నాడంటే?
ఇదే అంశంపై పంత్ ఓ కార్యక్రమంలో మాట్లాడాడు. "నేను ఆ సమయంలో ఏమి ఆలోచించానంటే. అప్పుడు గేమ్ ఊపందుకొంది. అంతకు ముందు 2, 3 ఓవర్లలో చాలా పరుగులు వచ్చాయి. ప్రపంచకప్ ఫైనల్‌లో ఈ క్షణం మళ్లీ ఎప్పుడు వస్తుందని అనుకొన్నాను. కాలు నొప్పితో బాధపడుతున్నట్లు చేశాను. ఫిజియో వచ్చి ఎలా ఉందని అడిగాడు. నేను అతడితో నేను కేవలం నటిస్తున్నానని చెప్పాను. వీలైనంత సమయం వృథా చేయమని సూచించాను. అలాంటి కీలక మ్యాచుల్లో ప్రతిసారి ఇలా చేయడం పనికొస్తుందని కాదు, కానీ కొన్నిసార్లు పని చేస్తుంది. ఆ క్షణంలో అనుకున్నది జరిగితే, అంతకు మించింది ఏముంటుంది." అని వివరించాడు.
RISHABH PANT - THE MOMENTUM BREAKER...!!! 😄👌
— Johns. (@CricCrazyJohns) October 12, 2024
Pant narrated the story behind his injury during the T20 World Cup final when SA needed 26 from 24. [Star Sports] pic.twitter.com/7AeyHAnzdF