IPL 2024 Lucknow Super Giants VS DC Jake Fraser : వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన దిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2024 సీజన్‌లో ఎట్టకేలకు రెండో విజయాన్ని అందుకుంది. అయితే ఈ విజయంలో కెప్టెన్ పంత్‌తో పాటు అరంగేట్రం యంగ్ ప్లేయర్ జేక్ ఫ్రేజర్ - మెక్‌గుర్క్ కూడా కీలకంగా వ్యవహరించాడు. వికెట్లు పడిపోతున్న క్రమంలో వార్నర్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన జేక్ వచ్చీరాగానే లఖ్‌నవూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతినే అద్భుతమైన సిక్సర్‌గా మలిచాడు. ముఖ్యంగా స్పిన్నర్ కృనాల్ పాండ్యాను అయితే ఓ ఆట ఆడేసుకున్నాడు. 13 ఓవర్ వేసిన పాండ్యా బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లు బాదిన ఇతడు మొత్తంగా 35 బంతుల్లో 2 ఫోర్లు ,5 సిక్స్‌లతో 55 పరుగులు సాధించాడు. దీంతో ఎవరీ జేక్ ఫ్రేజర్ - మెక్‌గుర్క్ అని క్రికెట్ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఎవరీ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్?
జేక్ ఫ్రేజర్ వయసు 22 ఏళ్లు. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో 2002 ఏప్రిల్ 11న జన్మించాడు. ధనాధన్ భారీ హిట్టింగ్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా మారుతున్నాడు. 2019లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టి విక్టోరియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అదే ఏడాది లిస్ట్-ఏ క్రికెట్‌లోనూ అడుగుపెట్టి అదరగొట్టడంతో బిగ్‌బాష్‌లో లీగ్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం వచ్చింది.
బిగ్‌బాష్ లీగ్ 2020 సీజన్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరపున టీ20ల్లో అరంగేట్రం చేసిన జేక్ ఇప్పటివరకు తన 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 645 రన్స్ సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 550 పరుగులు, లిస్ట్-ఏ క్రికెట్‌లో 525 రన్స్ చేసి తన ఖాతాలో వేసుకున్నాడు.
గతేడాదిలో లిస్ట్-ఏ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు కూడా అందుకున్నాడు. ఆస్ట్రేలియా దేశీవాళీ వన్డే టోర్నీలోనూ కేవలం 29 బంతుల్లోనే శతకం బాది రికార్డుకెక్కాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. 2020లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లోనూ బరిలోకి దిగాడు. ఈ ఏడాది అంతర్జాతీయ అరంగేట్రం కూడా చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌తో ఎంట్రీ ఇచ్చాడు. ఆడిన రెండు మ్యాచుల్లో 51 పరుగులు చేశాడు.
ఈ క్రమంలోనే ఐపీఎల్-2024 వేలంలో రూ. 50 లక్షల కనీస ధరతో బరిలోకి దిగాడు. కానీ అతడిని ఎవరు కొనుగోలు చేయలేదు. అయితే ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ పర్సనల్ రీజన్స్‌తో ఈ సీజన్ నుంచి తప్పుకోవడం వల్ల అతడికి ఆడే ఛాన్స్ దక్కింది.
కొత్త కుర్రాడి మెరుపులు - లఖ్‌నవూపై దిల్లీ విజయం - LSG vs DC IPL 2024