India Vs Newzealand 1st Test : భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇటు అభిమానులకు అటు ప్లేయర్లకు చెరగని మచ్చగా మిగిలిపోయిన రోజు ఏదైనా ఉందంటే అది 2020 డిసెంబర్ 19 అని చెప్పాలి. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 36 పరుగులకే కుప్పకూలిన రోజు అది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత తాజాగా టీమ్ఇండియా అటువంటి పరిస్థితినే ఎదుర్కొంది. అప్పుడంటే మ్యాచ్ ఆస్ట్రేలియాలో జరిగింది కదా, అక్కడి పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయని అనుకోవచ్చు. కానీ ఇప్పుడేమో ఇది సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్. ఎంతో స్ట్రాంగ్‌గా బరిలోకి దిగిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటై అందరినీ నిరాశకు గురిచేసింది.
అయితే ఇక్కడ న్యూజిలాండ్ పేసర్లు మన బలహీనతలను అలాగే పరిస్థితులను సద్వినియోగం చేసుకుని ఆడారన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. బంతిని బయటకు స్వింగ్ చేసిన టిమ్ సౌథీ, సీమ్‌ను ఉపయోగించి లోపలికి కూడా పంపించాడు. ఇక సీమ్‌కు పేస్‌ను జతచేసి హెన్రీ కూడా రెండు వైపులా బంతులను పంపించాడు. 6.4 అడుగుల ఎత్తున్న విలియమ్ మంచి కూడా ఈ మ్యాచ్‌లో బౌన్స్‌ను సాధించాడు. వీరందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మన ప్లేయర్లను చతికలపడేలా చేశారనడం కాస్త కష్టంగానే అనిపిస్తోంది. ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టి మన ప్లేయర్లను అవాకయ్యేలా చేశారు.
మరోవైపు మన బ్యాటర్ల వైఫల్యం కూడా ఈ ఓటమికి మరో కారణమని అంటున్నారు విశ్లేషకులు. పరిస్థితులను అర్థం చేసుకోకుండా, పిచ్‌కు అనుగుణంగా బ్యాటింగ్ చేయకుండా, అనవసర షాట్లతో ప్రత్యర్థులకు ఈజీగా వికెట్లు అందించారు. టెక్నిక్‌ను మర్చిపోయి ఓటమిని చవి చూశారు. మేటి బ్యాటర్లైన సర్ఫరాజ్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ కూడా డకౌటై పెవిలియన్ బాట పట్టారు.
అయితే మొదట లెంగ్త్‌లో పడ్డ బంతిని రోహిత్ ముందుకు వచ్చి ఆడాల్సిన అవసరం లేదని విశ్లేషకుల మాట. కానీ అప్పటివరకూ ఓపికతో ఉన్న రోహిత్ ముందుకు వచ్చి ఆ బంతిని ఆడాడు. అది కాస్త లోపలికి స్వింగ్ అయి స్టంప్స్‌కు తగిలింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా సర్ఫరాజ్ వెనుతిరిగాడు . క్రీజులో కుదురుకోవాల్సింది పోయి షాట్‌కు ప్రయత్నించి డకౌట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ కాస్త ఆ లెగ్‌సైడ్ వెళ్తున్న బాల్‌ను వదిలేసుంటే సరిపోయేది. కానీ ఆడి మరీ వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. జడేజా కూడా అనవసరమైన షాట్ ఆడి ఔటయ్యాడు. బంతిని చూడకుండానే అతడు ఫ్లిక్ చేసినట్లు తెలుస్తోంది. కాస్తో కూస్తో పోరాడిన రిషబ్ పంత్ బంతి కదలికను తప్పుగా అంచనా వేసి మరీ ప్రత్యర్థులకు దొరికిపోయాడు.
ఇదిలా ఉండగా, రోహిత్ (16), కోహ్లి (9), సర్ఫరాజ్ (3), రాహుల్ (6), జడేజా (6), అశ్విన్ (1) కంటే కుల్‌దీప్ (17) ఎక్కువ సేపు క్రీజులో నిలబడటం గమనార్హం. సిరాజ్ కూడా 16 బంతులు ఆడాడు. బ్యాటర్లు తమ డిఫెన్స్ టెక్నిక్‌ను నమ్మినట్లు కనిపించలేదని విశ్లేషకుల అభిప్రాయం. ప్రత్యర్థి బౌలర్ల వ్యూహాలను వీళ్లు అర్థం చేసుకోలేదని మాట. లెగ్‌గల్లీలో ఫీల్డర్‌ను పెట్టినా కూడా కోహ్లీ జాగ్రత్తపడలేదు.
మరోవైపు ఈ సిరీస్ తర్వాత టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ ఇలాగే బ్యాటింగ్ కొనసాగితే మాత్రం అక్కడ కూడా భారత జట్టుకు ఘోర పరాభవం తప్పదు. ఈ ఇన్నింగ్స్ నుంచి పాఠాలు నేర్చుకోవడం అత్యవసరమని అభిమానులు, మాజీ క్రికెటర్లు అంటున్నారు.
5 డకౌట్లు, 46 పరుగులకే ఆలౌట్ - 92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు
నలుగురు భారత బ్యాటర్లు డకౌట్, 34 రన్స్‌కే 6 వికెట్లు డౌన్ - 1969 తర్వాత ఇదే తొలిసారి