IND VS NZ First Test Teamindia First Innings : న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మొదటి టెస్ట్‌లో టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. స్వదేశంలో తిరుగులేని భారత జట్టు గట్టి దెబ్బ కొట్టారు న్యూజిలాండ్ బౌలర్లు. మన బ్యాటర్లను పరుగులు కాదు కదా కనీసం బంతిని కూడా ఎదుర్కోనివ్వకుండా బంబేలెత్తించారు. దీంతో మన బ్యాటర్లలో ఏకంగా ఐదుగురు డకౌట్ అవ్వాల్సి వచ్చింది. వారిలో నలుగురు స్టార్ బ్యాటర్లు కూడా ఉండటం గమనార్హం. మిగత వారు కూడా త్వరగా విఫలమవ్వడంతో టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 31.2 ఓవర్లకే ఆలౌట్ అయింది. కేవలం 46 పరుగులు మాత్రమే చేసింది. గత 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం. గతంలో 75 పరుగులు (1987లో) వెస్టిండీస్‌పై చేసింది.
రోహిత్ శర్మ కేవలం 2 పరుగులకే ఔట్ అవ్వగా, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ అస్సలు పరుగుల ఖాతా తెరవకుండానే చేతులెత్తేశారు. యశ్వస్వి జైశ్వాల్ (13), పంత్ (20), చివర్లో కుల్దీప్ యాదవ్ (2), బుమ్రా (1), సిరాజ్ (4) పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ (5/15), విలియమ్ ఓరౌర్కీ (4/22), టిమ్ సౌథీ(1/8) చెలరేగారు.
మరికొన్ని విశేషాలు
- భారత్‌లో న్యూజిలాండ్ మొత్తం పది వికెట్లు పడగొట్టడం విశేషం. భారత్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్‌గా మ్యాట్ హెన్రీ ఘనత సాధించాడు.
- ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన మ్యాట్ హెన్రీ టెస్టుల్లో అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన కివీస్ బౌలర్ల జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. మూడో స్థానంలో నిలిచాడు. హెన్రీ 26 టెస్టుల్లో ఈ మార్క్ టచ్ చేయగా, రిచర్డ్ హ్యాడ్లీ (25), నీల్ వాగ్నెర్ (26) ఈ ఫీట్‌ను అందుకున్నారు.
- ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక డక్‌లు అవ్వడం టీమ్ ఇండియాకు ఇది ఐదో సారి కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఐదుగురు బ్యాటర్లు అస్సలు పరుగుల ఖాతానే తెరవలేదు. 2014లో ఇంగ్లాండ్‌పై ఆరుగురు డకౌట్‌గా పెవిలియన్ చేరారు.
- మొత్తంగా 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో సొంత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అత్యల్ప స్కోరు ఇదే. ఈ పోరులో 46 పరుగులు మాత్రమే చేసింది. గతంలో ముంబయి వేదికగా 2021లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్పైనే 62 పరుగులు చేసింది. ఇది మూడో అత్యల్ప స్కోరు ఇది. ఇకపోతే గతంలో అడిలైడ్ వేదికగా ఆసీస్‌పై 36 పరుగలుకే ఆలౌటైన సంగతి తెలిసిందే.
నలుగురు భారత బ్యాటర్లు డకౌట్, 34 రన్స్‌కే 6 వికెట్లు డౌన్ - 1969 తర్వాత ఇదే తొలిసారి