Ranji Trophy 2024: భారత డొమెస్టిక్ క్రికెట్లో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ ఫార్మాట్ మారే ఛాన్స్ ఉంది. సీజన్ 2024-25ను రెండు దఫాలుగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డొమెస్టిక్ క్రికెట్ క్యాలెండర్ రీ షెడ్యూల్ ప్రతిపాదనను అపెక్స్ కౌన్సిల్‌కు పంపినట్లు సమాచారం. బోర్డు కార్యదర్శి జై షా, టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) ప్రెసిడెంట్ వీవీఎస్ లక్ష్మణ్‌ను సంప్రదించిన అనంతరం ఈ ప్రతిపాదనను సిద్ధం చేశారట.
కొత్త ఫార్మాట్ ప్రకారం 5 రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌ల తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారె ట్రోఫీలను నిర్వహిస్తారు. ఈ వైట్‌బాల్ టోర్నమెంట్ల అనంతరం మిగిలిన రెండు రంజీ లీగ్ మ్యాచ్‌లు, నాకౌట్ దశ మ్యాచ్‌లు ఆడిస్తారు. అయితే రంజీలో మెజారిటీ మ్యాచ్‌లకు నార్త్ ఇండియా రాష్ట్రాలే ఆతిథ్యం ఇస్తాయి. అక్కడ శీతాకాలంలో ప్రతికూల వాతావరణం వల్ల ఆటకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక మ్యాచ్‌ల మధ్య విరామం ఉండాలని భావించిన నిర్వాహణ కమిటీ ఈ మార్పునకు ప్రతిపాదించింది.
గతేడాది మ్యాచ్‌ల మధ్య కేవలం మూడు రోజుల విరామం ఉండడం వల్ల ప్లేయర్లకు తగినంత విశ్రాంతి లభించలేదు. 'మ్యాచ్‌ల మధ్య విరామం పెంచుతాం. కోలుకోవడానికి, సీజన్ ఆసాంతం అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగించడానికి ఆటగాళ్లకు ఇది ఉపయోగపడుతుంది' అని జై షా చెప్పారు. కొత్త ఫార్మాట్ ప్రతిపాదన ప్రకారం దులీప్ ట్రోఫీతో దేశవాళీ సీజన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఇరానీ కప్, దులీప్ ట్రోఫీ జరుగుతాయి. ఆ తర్వాత రంజీ ట్రోఫీ ఆరంభమవుతుంది.
2024 Ranji Trophy Winner: 2024 రంజీ ట్రోఫీ టైటిల్ ముంబయి కైవసం చేసుకుంది. మార్చిలో జరిగిన ఫైనల్లో విదర్భ జట్టుపై ముంబయి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 169 పరుగుల తేడాతో నెగ్గిన ముంబయి 42వ సారి రంజీ ఛాంపియన్‌గా నిలిచింది. 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 368 పరుగులకే కుప్పకూలింది. కాగా, గత ఎనిమిదేళ్లలో ముంబయి రంజీ ట్రోఫీ ఛాంపియన్‌గా నిలివడం ఇదే తొలిసారి. చివరిసారిగా ముంబయి 2015- 16లో టైటిల్ నెగ్గింది.