Asia Team Championship Finals : భారత బ్యాడ్మింటన్ మహిళా జట్టు ఇటీవలే ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో జపాన్‌పై 3-2 తేడాతో గెలిచింది. హోరా హోరీగా జరగిన ఈ టోర్నీలో తొలుత జపాన్ ఆధిపత్యం చూపించింది. అయితే భారత షట్లర్ పీవీ సింధును 13-21, 20-22 తేడాతో ఓడిచిన అయా ఒహోరి జపాన్ స్కోర్‌ను 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లింది.
ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో భారత యంగ్ ప్లేయర్స్ త్రిసా-గాయత్రీ గోపిచంద్ అద్భుత పోరాటం వల్ల నమీ మత్సుయమ-చిహారు షిద పై 21-17, 16-21, 22-20 తేడాతో ఘన విజయాన్ని సాధించారు. దీంతో ఇరు జట్లూ 1-1తో సమంగా నిలిచాయి. మరో మ్యాచ్‌లో నొజోమి ఒకుహర తన ఛాంపియన్ గేమ్‌తో జపాన్ను మళ్లీ ఆధిక్యంలోకి వచ్చేలా చేసింది. అష్మితాపై 21-17, 21-14 తేడాతో ఒకుహర విజయాన్నిసొంతం చేసుకుంది. దీంతో జపాన్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.
ఇక మిగిలిన రెండు రౌండ్లలో గెలిస్తేనే భారత్ ఫైనల్‌కు చేరుకుంటుంది. అలాంటి సమయంలో అశ్విని పొన్నప్పతో కలసి పీవీ సింధు ప్రపంచంలోనే నంబర్ 11స్థానంలో ఉన్న జోడీ మియుర- అయకో సుకురమోటోపై 21-14, 21-11తో గెలుపొందింది. దీంతో భారత్-జపాన్ 2-2తో సమంగా నిలిచాయి.
మరోవైపు చివరి మ్యాచ్‌లో భారత యంగ్ షట్లర్ అనమోల్ 52 నిమిషాల పాటు తీవ్రంగా పోరాడి వరల్డ్ 29వ ర్యాంకర్ నత్సుకి నిదైరాపై గెలుపును సొంతం చేసుకుంది. ఫైనల్ రౌండ్లో 21-14, 21-11తో నత్సుకిని అనమోల్ను ఓడిచింది. దీంతో 3-2 తేడాతో భారత్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్స్ ఫైనల్‌కు చేరుకున్న ఘనత సాధించింది.
సింధు సూపర్ కమ్‌బ్యాక్
గాయం కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్స్ 2024 టోర్నమెంట్‌తో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. నాలుగు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన సింధు అదరగొట్టింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో చైనీస్ టాప్ సీడ్ హాన్ యుతో తలపడ్డ సింధు 40 నిమిషాల్లోనే ఆటను ముగించింది. హాన్ యుపై సింధు 21-17, 21-15 తేడాతో నెగ్గింది. దీంతో ఛాంపియన్షిప్స్ నాకౌట్లో చైనాతో తలపడ్డ భారత్ తొలి మ్యాచ్‌లోనే నెగ్గి 1-0 లీడ్‌లోకి దూసుకెళ్లింది.
ఆసియా బ్యాడ్మింటన్‌లో సింధు అదుర్స్- 3-2 తేడాతో చైనాపై భారత్ విక్టరీ
హాంగ్‌కాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి ఎంట్రీ - తొలి పతకాన్ని ముద్దాడనున్న భారత్