Vinayaka Pooja for Horoscope Wise in Telugu: విఘ్నాలను తొలగించి.. విజయాలు అందించమని కోరుకుంటూ వినాయక చవితి పండగ జరుపుకొంటాం. పండగ రోజున గణనాధుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తాం. అనేక రూపాలు.. ఆకట్టుకునే రంగుల్లో కొలువుదీరిన ఆ గణపతిని పూలతో అలకరించి.. రకరకాల పండ్లు, ఆహార పదార్థాలను నైవేద్యంగా పెడతాం. అయితే చవితి రోజు ఒక్కో రాశి వారు ఒక్కో రంగు కలిగిన గణపతిని పూజించి, ఒక్కో ప్రసాదాన్నిపెడితే అఖండ విజయ ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
వినాయక చవితి రోజు మీ రాశిని బట్టి ఈ రంగు మట్టి గణపతిని పూజించి నైవేద్యం సమర్పిస్తే స్వామి వారి అనుగ్రహం సులభంగా లభిస్తుందని.. సంవత్సరం మొత్తం ఆర్థికంగా కలిసోస్తుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. అలాగే ఖర్చులు తగ్గిపోతాయని, అప్పుల సమస్య నుంచి బయటపడవచ్చని, అదృష్టం కలిసివస్తుందని, అఖండ విజయ ప్రాప్తి కలుగుతుందని వివరిస్తున్నారు. మరి ఏ రాశి వారు ఏ రంగు గణపతిని పూజించాలి? ఏ నైవేద్యం పెట్టాలో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి: ఈ రాశి వారు వినాయక చవితి రోజున ఎరుపు లేదా గులాబి రంగు కలిగిన మట్టి గణపతి విగ్రహాన్ని పూజించి బూందీ లడ్డూ సమర్పించాలని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
వృషభ రాశి: పండగ రోజున వృషభ రాశి వారు లేత పసుపు రంగులో ఉన్న మట్టి విగ్రహాన్ని పూజించి మోదకాలు నైవేద్యంగా సమర్పించాలని సూచిస్తున్నారు.
మిథున రాశి: ఈ రాశి వారు మాత్రం ఆకుపచ్చ రంగు మట్టి విగ్రహాన్ని పూజించాలని చెబుతున్నారు. అలాగే ఎలాంటి పదార్థాలను నైవేద్యంగా పెట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు. దానికి బదులుగా చిన్న బెల్లం ముక్క పెట్టినా సరిపోతుందంటున్నారు. అయితే ప్రసాదాలు పెట్టినా, పెట్టకపోయినా 21 గరిక పూసలు మాత్రం కచ్చితంగా పెట్టమని సలహా ఇస్తున్నారు.
కర్కాటక రాశి: వినాయక చవితి రోజున కర్కాటక రాశివారు తెలుపు రంగు మట్టి గణపతికి పూజ చేసి గోధుమ పిండితో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టమని సలహా ఇస్తున్నారు.
సింహ రాశి: ఈ రాశి వారు సింధూరం రంగులో ఉండే మట్టి గణపతికి పూజ చేసి బెల్లంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టమని సూచిస్తున్నారు.
కన్యా రాశి: ఈ రాశి వారు మాత్రం ఆకుపచ్చ రంగు మట్టి విగ్రహాన్ని పూజించాలని చెబుతున్నారు. అలాగే చవితి నాడు ఆ పార్వతీ తనయుడికి పెసరపప్పుతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టమని సలహా ఇస్తున్నారు.
తులా రాశి: తులా రాశి వారు వినాయక చవితి రోజున లేత నీలం రంగులో ఉన్న మట్టి విఘ్నేశ్వరుడిని పూజించి బూందీ లడ్డూ సమర్పించాలని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు పండగ నాడు ఎరుపు రంగు విగ్రహాన్ని పూజించి.. స్వామి వారికి రకరకాలైన లడ్డూలను నైవేద్యంగా పెట్టమని సలహా ఇస్తున్నారు.
ధనస్సు రాశి: వినాయక చవితి నాడు ధనస్సు రాశి వారు పసుపు రంగులో ఉన్న మట్టి గణపతిని పూజించి.. స్వామి వారికి అరటి పండ్లు నైవేద్యంగా పెడితే మంచిదని చెబుతున్నారు.
మకర రాశి: ఈ రాశి వారు లేత నీలం రంగులో ఉన్న మట్టి గణపతిని పూజించి మోతీచూర్ లడ్డూలను వినాయక చవితి రోజు నైవేద్యంగా పెడితే మంచిదని చెబుతున్నారు.
కుంభ రాశి: ఈ రాశి వారు వినాయక చవితి రోజున నీలం రంగులో ఉన్న మట్టి విఘ్నేశ్వరుడిని పూజించి.. ఆయనకు బూందీ లడ్డూ సమర్పించాలని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
మీన రాశి: ఈ రాశి వారు వినాయక చవితి రోజున పసుపు రంగు మట్టి విఘ్నేశ్వరుడిని పూజించి బూందీ లడ్డూ సమర్పించాలని చెబుతున్నారు.
జన్మ లేదా నామ రాశి ఆధారంగా గణపతికి నైవేద్యం సమర్పించి దానిని ఇతరులకు పంచి పెట్టడం లేదా మీరు తీసుకోవడం వల్ల విఘ్నేశ్వరుడి అనుగ్రహం లభించి సంవత్సరం మొత్తం ఆర్థికంగా లాభం చేకూరుతుందని అంటున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
వినాయకుడి తొండం ఆ వైపు ఉంటే అదృష్టం! - ఈ రంగు విగ్రహాన్ని అసలే తీసుకోవద్దు! - vinayaka chavithi 2024